YSRCP Government Closing Skill Training Centers in AP: చంద్రబాబుపై కక్షతో జగన్ నైపుణ్య శిక్షణా కేంద్రాలపై పగ పట్టారు. అక్రమ కేసుల్లో బాబును జైలుకు పంపడానికి స్కిల్ సెంటర్లను అస్త్రంగా వాడుకున్నారే తప్ప.. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దే కేంద్రాలుగా వాటిని భావించడం లేదు. ప్రభుత్వ ఒంటెద్దు పోకడలతో.. ఇప్పటికే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. రాజకీయ వేధింపులతో విస్తరణ ప్రాజెక్టులు సైతం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. మిగిలిన కొద్దిపాటి పరిశ్రమల్లో కూడా నిపుణుల్లేరు. దీంతో అధిక వేతనాలు చెల్లిస్తూ.. ఒడిశా, బిహార్ నుంచి కార్మికులను వెతికి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
చదువులు అయిపోయి డిగ్రీలు చేతికొచ్చాక మన యువత ఎక్కడికి పోవాలి. ఉద్యోగాలు వెతుక్కుంటూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లాలి. ఇక్కడెక్కడా ఉద్యోగాలు రావనుకుంటే దుబాయి, కువైట్‌కు పోవాలి. వారికి స్థానికంగా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వం ఆలోచన. "మీకు ఎలాంటి స్కిల్ ఉన్న మానవ వనరులు కావాలో చెబితే.. మేం ఖర్చు పెట్టి 3 ఏళ్లలో వారిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తాం. ఆ శిక్షణలో పరిశ్రమల తరఫున కూడా పాల్గొంటే.. అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు. వారికి కంపెనీల్లో కచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి". ఇవి సీఎం జగన్ నైపుణ్యాభివృద్ధిపై అసెంబ్లీ వేదికగా 2019 జూన్ 24న చెప్పిన మాటలు. ఇదంతా విని నిజంగానే యువతకు ఉద్యోగాలు వచ్చి బాగా స్థిరపడ్డారు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవవనరులను సమకూరుస్తామని చెప్పడమే తప్పించి ఆ దిశగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు లేవు. చంద్రబాబుపై ఉన్న కోపంతో ఉన్న కేంద్రాలను ఒక్కొక్కటిగా మూసేస్తోంది. వాటిపై బురదజల్లుతూ.. కేసులు పెట్టి పారదోలుతోంది. అలా చేస్తే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు అందించడం సాధ్యమేనా. ప్రకటన చేసిన నాలుగేళ్లలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన మానవ వనరులు ఎంత. అంటే వాటికి జగన్ దగ్గర సమాధానమే లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి పైసాతో సహా పన్నులు కడుతూ.. నైపుణ్య కార్మికుల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం చేశామని.. యువతలో నైపుణ్యాన్ని పెంచి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని ప్రగల్భాలు పడకం తప్ప వారిలో నైపుణ్యం పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి.. గత ప్రభుత్వం 34 చోట్ల సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. శిక్షణ కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడ అందుబాటులోకి తెచ్చింది. వెల్డింగ్, బాయిలర్లు, యంత్రాల్లో ఉపయోగించే విడిభాగాల డిజైన్లు, నమూనా కటింగ్‌పై విస్తృత శిక్షణను కేంద్రాల్లో అందించారు. చదువు పూర్తయిన వెంటనే శిక్షణ పొందిన వారు ఉద్యోగాలు కూడా సాధించారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఉన్న కేంద్రాలను ఎలా మూసేయాలి అనే కుట్రలు చేస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
కొవిడ్ సమయంలో సొంతూళ్లకు తిరిగి వెళ్లిన కార్మికుల్లో సుమారు 50 శాతం మంది తిరిగి రాలేదు. కార్మికుల కొరతతో 3 షిఫ్టుల్లో పరిశ్రమలను నడపడం పారిశ్రామికవేత్తలకు కష్టంగా మారింది. అందుబాటులో ఉన్న సిబ్బందితో రెండు షిఫ్టుల్లో పని చేయిస్తున్నారు. గతంలో పనులు వెతుక్కుంటూ కూలీలే ఇక్కడకు వచ్చేవారు. ప్రస్తుతం బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వెళ్లి ఒప్పందంపై కార్మికులను తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
కూలీలకు రవాణా ఖర్చులతోపాటు ముందస్తుగా అడ్వాన్సు ఇస్తేనే వస్తున్నారని పరిశ్రమల నిర్వాహకులు అంటున్నారు. కార్మికుల కొరత కారణంగా వారికి చెల్లించే జీతాలను సుమారు 35 శాతం పెంచాల్సి వచ్చింది. గతంలో ఒక్కో కార్మికునికి భోజనం, వసతి సదుపాయంతో కలిపి 12 వేలు చెల్లిస్తే.. ప్రస్తుతం అది 16 వేలకు పెరిగింది. ఎంతో కష్టపడి వెతికి పట్టుకుని కార్మికులను తెచ్చుకున్నా వాళ్లు ఎన్ని రోజులు ఉంటారన్న నమ్మకం లేదు.
చాలా మంది సమాచారం లేకుండా రాత్రికిరాత్రే పారిపోతున్నారు. దీనివల్ల మరుసటి రోజు షిఫ్టుపై ప్రభావం పడుతోంది. అప్పటికప్పుడు కార్మికులను సర్దుబాటు చేయడం సాధ్యం కావడం లేదు. ఈ పరిణామాలతో నిర్దేశిత వ్యవధిలో ఆర్డర్లను పూర్తి చేసి సరఫరా చేయలేకపోతున్నామని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి అనుభవం చవిచూడలేదని చెబుతున్నారు. పరిశ్రమల అవసరాలను గుర్తించి.. ఐటీఐ, పాలిటెక్నిక్ స్థాయి నుంచే యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయంటున్నారు.