Unsatisfied YSRCP Corporators : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తీరుపై వైసీపీ కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే, మేయర్‌కు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవటంతో.. కమిషనర్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే కమిషనర్ ముందు మొర పెట్టుకుని మీడియా ముందు మాత్రం అంతా బాగుందంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం చర్చానీయాంశమైంది.
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫాపై వైసీపీ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. ఆదివారం ప్రత్యేకంగా సమావేశమమైన నియోజకవర్గం పరిధిలోని 18 మంది కార్పొరేటర్లు.. ఎమ్మెల్యే కుమార్తె పెత్తనంపై చర్చించినట్లు సమాచారం. అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆమెకు ప్రాధాన్యం పెరగడంపై కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అధికారులు కూడా తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై కార్పొరేటర్లు అసహనంతో ఉన్నారు. అభివృద్ధి పనులపై పలుమార్లు ఎమ్మెల్యే, మేయర్‌కు విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాకపోవడంతో.. వారంతా కమిషనర్‌కు కలిశారు.
ఒకేసారి 18 మంది కార్పొరేటర్లు వెళ్లి.. కమిషనర్ కీర్తి చేకూరితో గంటపాటు మాట్లాడారు. డివిజన్ల వారీగా సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వాలని, చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. గాంధీపార్కు ఆధునీకరణ శిలాఫలకంపై కార్పొరేటర్ల పేరు వేయాలని, ఎన్టీఆర్ స్టేడియంలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని కోరారు. తూర్పు కన్నా పశ్చిమ నియోజకవర్గంలో పనులు వేగంగా, అభివృద్ధి బాగా జరుగుతోందని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే, మేయర్‌కు మధ్య సఖ్యత లేదని అందువల్లే తూర్పులో పనులు కావటం లేదని ఒకరిద్దరు కార్పొరేటర్లు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కమిషనర్‌ను కలిసి అనంతరం మీడియాతో మాట్లాడిన కార్పొరేటర్లు.. తాము ఎవరికీ వ్యతిరేకం కాదంటూ చెప్పుకొచ్చారు.
పనులు వేగంగా చేయాలని గుత్తేదారుల్ని అడిగితే.. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారన్న కార్పొరేటర్లు, వాటిని త్వరగా చెల్లించాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. డివిజన్లలో సమస్యలు, చేయాల్సిన పనుల వివరాలు తనకు పంపిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారన్నారు.
"అందరం కలిశాం కాబట్టి కమిషనర్‌కు చిన్న చిన్న సమస్యలు వివరించాము. పనులు త్వరగా చేయించాలని కమిషనర్‌ను కోరాము తప్ప మరేమి లేదు. మేయర్, ఎమ్మెల్యేలు మా నాయకులు వారి ఆధ్వర్యంలోనే మేము ముందుకు వెళ్తాము. గ్యాలరీ, మీడియా పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆమెకు విన్నవించాము. ఆమె దానికి సానుకూలంగా స్పందించారు." - కార్పొరేటర్లు
ఇవీ చదవండి :