బీసీ కులాల అభివృద్ధి దిశగా వైకాపా ప్రభుత్వం బాటలు వేసిందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. సీఎం జగన్ 139 బీసీ కులాలకు 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పాలక మండళ్లను నియమించారన్నారు. 56 మంది చైర్మన్లలో 29 మంది మహిళలు కాగా 27 మంది పురుషులు ఉన్నారని... 672 మంది బీసీలకు డైరెక్టర్లుగా పదవులు దక్కాయని తెలిపారు.
ఎన్నడూ లేని విధంగా బీసీ వర్గాలకు ఇన్ని పదవులు దక్కడంతో అన్ని జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొందని శ్రీదేవి అన్నారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదని, ఎన్నో ఏళ్లుగా బీసీ కులాలు కంటున్న కలలు నిజమయ్యాయని పేర్కొన్నారు.
బీసీల్లో ఎంతో మంది సంచార జాతుల వారున్నారని.. ఇకపై వారంతా ప్రభుత్వ సాయాన్ని పొందేందుకు ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి అదే కులానికి చెందిన వారిని చైర్మన్‌గా నియమించి భరోసా కల్పించిందన్నారు. కులాల ప్రాతిపదికన ఇంత పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారన్నారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్లుగా నామినేటెడ్ పదవుల నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైకాపా ప్రభుత్వానికే దక్కిందన్నారు.
2.71 కోట్ల మందికి రూ.33,500 కోట్లు
వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలల వ్యవధిలోనే... 2,71,37,253 మంది బీసీల సంక్షేమం కోసం రూ.33,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. బీసీలకు ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేసిన ప్రభుత్వం, చరిత్రలో ఇప్పటి వరకు లేదన్నారు.
ఇదీ చదవండి: