గుంటూరు జిల్లాలో తెదేపా కార్యకర్తపై.. వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన వెంకట నారాయణ.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్తిపాడు మండలం బోయపాలెం సమీపంలోని పొలాల్లో ఈ దాడి జరిగింది.
చంద్రబాబుపై నోరుపారేకున్నారు.. తట్టుకోలేకే ఎదిరించాను
సోమవారం రాత్రి 11 గంటలకు.. వెంకట నారాయణ తన అత్తింటివారి నుంచి వస్తూ.. బోయపాలెం వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేసి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లారు. అదే సమయంలో అక్కడ మరి కొందరు మద్యం తాగుతున్నారు. వారు తెదేపా అధినేత చంద్రబాబును దూషిస్తుండటంతో.. వెంకట నారాయణ తట్టుకోలేక.. వారితో వాగ్వాదానికి దిగాడు. ఆయన ఒక్కడే కావడం.. వైకాపా కార్యకర్తలు నలుగురు ఉండటంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. మద్యం సీసాతో తలపైకొట్టడంతో పాటు నిప్పంటించి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన వెంకట నారాయణ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇవాళ ఉదయం ఘటనా స్థలానికి సమీపంలో.. పని కోసం వెళ్తున్న కూలీలు.. అతడిని గుర్తించి వెంటనే 108కు సమాచారమిచ్చారు. వారు గుంటూరు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
చంద్రబాబు నాయుడిపై అనవసరంగా నోరు పారేసుకోవడంతో తట్టుకోలేక ఎదిరించాను. దీంతో వైకాపా కార్యకర్తలు దాడి చేశారు- వెంకట నారాయణ, బాధితుడు
క్రూర జంతువుల కంటే దారుణంగా తయారయ్యారు: అచ్చెన్నాయుడు
క్రూర జంతువుల కంటే దారుణంగా.. రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు తయారయ్యారని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మనుషుల రక్తం తాగి ఆనందించిన నియంతలను, క్రూరులను కూడా.. వైకాపా నేతలు మించిపోతున్నారని ధ్వజమెత్తారు. తమను ప్రశ్నించేవారే ఉండకూడదు, ఎదిరించిన వారు బతికి ఉండకూడదు అనేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలకు జరిగిన ప్రతి దాడికి.. సమాధానం చెప్పడం తధ్యమని హితవు పలికారు. వెంకటనారాయణకు ఏం జరిగినా అందుకు జగన్ రెడ్డే బాధ్యత వహించాలన్నారు.
బాధితుడికి పరామర్శ
గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితుడిని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ పరామర్శించారు. వెంకట నారాయణపై దాడికి పాల్పడ్డ వైకాపా నాయకులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: Deadbodies found: స్వర్ణముఖి నదిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం