YCP ACTIVISTS FIRES ON MLA UNDAVALLI : తాడికొండలో వైసీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి.. పార్టీ పదవులు అమ్ముకుంటుందని అదే పార్టీకి చెందిన కార్యకర్తలు ఆరోపించారు. శ్రీదేవి.. తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకు గౌరవ అధ్యక్షులుగా ఉంటూ.. మార్కెట్ యార్డు నూతన పాలక వర్గం పేర్లు ప్రకటించారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ తాడికొండలోని పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..డబ్బులు ఇచ్చిన వారికే శ్రీదేవి పదవులు ఇస్తున్నారని వాపోయారు. ఇలా పదవులు అమ్ముకుంటూ పోతే పార్టీకి అన్యాయం జరుగుతుందని తెలిపారు. శ్రీదేవి అక్రమాలపై గతంలో పార్టీ దృష్టికి తీసుకెళ్లినా, నియోజకవర్గానికి అదనవు సమన్వయ కర్తను నియమించిన ఆమె తీరు మరలేదని ఆరోపించారు. శ్రీదేవి డబ్బులు తీసుకుంటున్నారని గతంలో అధికార పార్టీ కార్యకర్తలు ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డు పదవులు తాము చెప్పిన వారికి ఇవ్వకుంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రతి గ్రామంలో పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. డబ్బు కొట్టు.. పదవి పట్టు అను నినాదంతో శ్రీదేవి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధిష్ఠానాన్ని కూడా శ్రీదేవి లెక్క చేయడం లేదని తెలిపారు. ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తాళ్ల శివ నాగరాజు, మల్లంపేట రాఘవరెడ్డి, దాములూరు రాము , బుర్ర వెంకటేష్ రెడ్డి , అవుతు శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గత కొంతకాలంగా ఉండవల్లి తీరుపై పార్టీలో కుమ్మలాటలు జరుగుతున్నాయి. కార్యకర్తలతో శ్రీదేవి ప్రవర్తన సరిగా ఉండటం లేదని మాటలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి తీరుతో విసుగు చెందిన ఇతర నాయకులు పార్టీ అధిష్ఠానానకి ఫిర్యాదు చేసిన.. వారి మాటలను కూడా లెక్కచేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా పార్టీ పదవులను అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి.
ఇవీ చదవండి: