తెలంగాణలోని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ నానా రభస చేసింది. మహిళా ఎస్సైతోపాటు కానిస్టేబుళ్లపై దాడి చేసింది. బంజారాహిల్స్ జహీరానగర్ ప్రాంతంలో లీసా అనే మహిళ మద్యం మత్తులో పడి ఉంది. బంజారాహిల్స్ పోలీసులు ఆమెను ఠాణాకు తీసుకొచ్చారు.
మందేసిందని తీసుకొస్తే... చిందేసింది!
తేరుకున్న ఆమె పోలీసులతో గొడవకు దిగి, పారిపోయేందుకు ప్రయత్నించింది. మహిళా ఎస్సైతోపాటు ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. బూతులు తిట్టింది. ఒక కానిస్టేబుల్ చేతిని కొరికి, మరో కానిస్టేబుల్ మెడపై రక్కింది.
మీ అంతు చూస్తానంటూ...
కాసేపటి తరువాత మహిళా పోలీసులు ఆమెను గట్టిగా పట్టుకొని కూర్చోబెట్టారు. పోలీసుల అంతు చూస్తానంటూ బెదిరించింది. ఆమె వివరాలు తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పేరుతో పాటు నాగాలాండ్ ప్రాంతమని, మాదాపూర్ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు తెలిసింది.
ఇతర వివరాలు లభించలేదు. ఆమె మాదకద్రవ్యాలు తీసుకుందా, మద్యం మత్తులో ఉందా అనేది తెలియాల్సి ఉంది. మత్తు పూర్తిగా దిగిన తరువాత వివరాలు తెలుసుకొని ఆమె సంబంధీకులకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు వివరించారు.
ఇవీచూడండి: లైంగిక దాడికి యత్నించిన యువకునికి దేహశుద్ధి