NEXT DGP IN TELANGANA: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేందర్ రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ మేరకు గతంలోనే సాధారణ పరిపాలనా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అనురాగ్ శర్మ పదవీ విరమణ అనంతరం.. రాష్ట్ర రెండో డీజీపీగా మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మొదట ఇన్‌ఛార్జి, ఆ తర్వాత పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఏప్రిల్ నుంచి నాలుగేళ్లకుపైగా మహేందర్ రెడ్డి డీజీపీ బాధ్యతల్లో ఉన్నారు.
ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న తరుణంలో తదుపరి పోలీస్ బాస్ ఎవరన్నది చర్చనీయాంశమైంది. ఐపీఎస్‌గా కనీసం 30 ఏళ్లు సర్వీసు ఉన్న డైరెక్టర్ జనరల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్నవారికి డీజీపీలుగా అవకాశం ఉంటుంది. వారి జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపితే అన్ని అంశాలను పరిశీలించి అందులో మూడు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.
రాష్ట్రంలో డీజీపీ పోస్టుకు ప్రస్తుతం ఆరుగురు అధికారులు అర్హులుగా ఉన్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఉమేష్ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన రవి గుప్తా, అంజనీకుమార్ డీజీ హోదాలో ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, రాజీవ్ రతన్, 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్ అదనపు డీజీ హోదాలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రం ప్రస్తుతం సాధారణ పరిపాలనా శాఖ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్లు సమాచారం. సీఎం ఆమోదం లభిస్తే సదరు అధికారుల బయోడేటా, వివరాలను తీసుకొని యూపీఎస్సీకి పంపుతారు. కమిషన్ నుంచి మూడు పేర్లు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం అందులో ఒకరిని డీజీపీగా నియమిస్తుంది.
నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే ఇన్‌ఛార్జి డీజీపీని నియమించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ చేపట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి ఉంటే ప్రస్తుత డీజీపీ మహేందర్రెడ్డి పదవీకాలాన్ని గరిష్ఠంగా ఆరు నెలల వరకూ పొడిగించుకోవచ్చు. ఇందుకు కేంద్రం అనుమతి తప్పనిసరి. వీటన్నింటి నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరన్న విషయమై చర్చ జోరుగా సాగుతోంది.
ఇవీ చదవండి: