సొంత రాష్ట్రానికి పంపుతామని... సిద్ధంగా ఉండాలని అధికారి చెప్పిన మాట నమ్మిన 150 మంది పశ్చిమ బంగా కూలీలు రోడ్డున పడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని బంగారు దుకాణాల్లో... సుమారు 150 మంది పశ్చిమ బంగా నుంచి వచ్చిన కూలీలు పని చేస్తున్నారు. లాక్ డౌన్‌తో బంగారు దుకాణాలు మూత పడ్డాయి. దీంతో కూలీలు తమ రాష్ట్రానికి వెళ్లిపోతామని అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు.
మంగళగిరి తహసీల్దార్... కూలీల నుంచి గుర్తింపు పత్రాలు తీసుకొని వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. శనివారం రాత్రి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పడంతో కార్మికులు సిద్ధమయ్యారు. మరికొద్ది గంటల్లో తమ రాష్ట్రానికి వెళ్లిపోతున్నామని... తాము ఉంటున్న ఇళ్లు సైతం ఖాళీ చేశారు. వంట పాత్రలను చుట్టుపక్కల వారికి ఇచ్చేశారు. అంతలోనే వారి ఆశలు ఆవిరయ్యాయి. రాత్రి 11 గంటలు దాటినా తహసీల్దార్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. తీరా అర్థరాత్రి దాటిన తర్వాత మీ ప్రయాణం ఇపుడు కాదు మరోసారి అంటూ చెప్పడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు.
తామంతా ఉన్న ఇంటిని ఖాళీ చేశామని చెప్పడంతో అధికారి ముఖం చాటేశారు. స్వర్ణకార సంఘం ప్రతినిధులు కార్మికులకు ఆశ్రయం కల్పించారు. కార్మికులను మోసం చేసిన తహసీల్దార్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సంఘం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు.
టెంపోను ఢీకొట్టిన ట్రాక్టర్... బీహార్ వలస కార్మికులకు గాయాలు