Voter List Verification Process in AP: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా తూతూమంత్రంగా సాగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని డాన్ బాస్కో పాఠశాలలో మూడు పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఇద్దరు బీఎల్వోలు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు నియోజకవర్గంలోని ఓట్ల జాబితా అంతా.. తప్పుల తడకగా ఉంది. 79వ పోలింగ్ బూత్‌లో కొంతమందికి డబుల్ ఓట్లు ఉన్నాయి. బీఎల్వోలు సైతం సకాలంలో విధులకు హాజరు కావట్లేదు. కొంతమంది వచ్చి బయట పనులు చూసుకొని మళ్లీ వస్తున్నారు. దీని వలన ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.
తిరువూరులోని ఓటరు జాబితాలో కూడా చాలా అవకతకలు ఉన్నాయి. చనిపోయిన వారు, డబుల్ ఎంట్రీ, షిఫ్టింగ్‌పై తెలుగుదేశం కౌన్సిలర్ల బీఎల్వోలకు ఫిర్యాదు చేశారు. కొత్తగా ఓటు హక్కు కల్పించాలని పలువురు బీఎల్వోలకు దరఖాస్తు చేశారు. మరోవైపు పట్టణంలోని దాదాపు 16 బూత్‌లలో బీఎల్వోలు చెట్ల కిందనే విధులు నిర్వహిస్తూ కనిపించారు. బంటుమిల్లిలో ఉన్న ఆరు పోలింగ్ కేంద్రాలు ఒక్కటి కూడా ఉదయం 11 గంటల 40 నిమిషాల వరకు తెరుచుకోలేదు. కేంద్రాల్లో ఓటరు లిస్టు కూడా అందుబాటులో లేదు.
ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు అరకొరగా హాజరైన బీఎల్వోలు
గుంటూరు జిల్లాలోని ఓట్ల జాబితా తప్పులతడకగా ఉంది. చేబ్రోలు మండలం పోలింగ్ బూత్ నెంబర్ 141లో ఒకే డోర్ నెంబర్ పై 24 ఓట్లు ఓట్లు ఉన్నాయి. అయితే.. ఆ జాబితాలోని వారెవరు ఆ ఇంటి నెంబర్‌లో గతంలో గాని ప్రస్తుతం గాని నివాసం ఉండటం లేదు. మృతి చెందిన వారి పేర్లూ జాబితాలో వస్తున్నాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా తికమకగా ఉంది. పోలింగ్ స్టేషన్ల సంఖ్యలో మార్పులు రావడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. మంగళగిరిలోని భార్గవ్ పేటలో నివాసముంటున్న వారికి టిడ్కో ఇళ్లు కోసమని ఓట్లను అక్కడికి మార్చారు. టిడ్కో నివాస ప్రాంతంలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడతం తమ ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లో చనిపోయిన వారి పేర్లు ఓటర్ జాబితాలో రావడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తప్పులు లేకుండా ఓటర్ల జాబితా రూపొందించడంలో ఈసీ వైఫల్యం - తూతూ మంత్రంగా స్పెషల్ క్యాంపెయిన్
బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లోని కొంతమంది బీఎల్వోలు పోలింగ్ స్టేషన్‌కు ఆలస్యంగా వచ్చారు. వేటపాలెం మండలం కొత్తపేటలోని 154 వ పోలింగ్ కేంద్రానికి తాళం వేసి ఉండటంతో బీఎల్వో గేటు దగ్గరే విధులు నిర్వహించారు. ఒంగోలులో కొత్తగా ఓటు నమోదు కోసం అందజేసిన.. అర్జీల్లో మూడొంతులు జాబితాలో లేవు.
అంతేకాక చాలా చోట్ల మృతుల పేర్లు తొలగించకుండానే జాబితా విడుదల చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓట్ల పరిశీలన సర్వే సమయంలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు బీఎల్వోలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి పలు చోట్ల బీఎల్వోలు అందుబాటులో లేకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహంవ వ్యక్తం చేస్తున్నారు.
ఓటరు జాబితాలో అవకతవకలు - ఒకే ఇంటి నెంబర్‌పై పదుల సంఖ్యలో ఓట్లు