గుంటూరు జిల్లా వినుకొండలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును పోలీసులు గృహనిర్బంధించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని రాత్రి నోటీసులు ఇచ్చారు. కొవిడ్ నివారణ చర్యలపై కోటప్పకొండలో ప్రమాణం చేద్దామని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి.. జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు. ఆంజనేయులును కోటప్పకొండ గుడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
తనపై చేసిన ఆరోపణలపై గుడిలో దేవుడి ఎదుట ప్రమాణం చేద్దామంటే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పోలీసులతో తనను గృహ నిర్బంధం చేయించారని తెదేపా నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తెలిపారు. 23 ఏళ్లుగా సేవలందిస్తున్న శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్‌పై నిరాధార ఆరోపణలు చేసినందుకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ త్రికోటేశ్వరుని సన్నిధిలో సత్య ప్రమాణం చేద్దామంటే పోలీసులతో నోటీసులు ఇప్పించారని విమర్శించారు. ఆరోపణల్లో నిజముంటే ప్రమాణం చేయడానికి రావాలని కోరారు. హద్దు మీరి ప్రవర్తిస్తున్న పోలీసులు గడియారం ముల్లు మళ్లీ తిరిగి వస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలని ఆయన హెచ్చరించారు. త్రికోటేశ్వరుని సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమంటూ చేసిన ప్రకటనపై పోలీసులు అప్రమత్తమై.. కర్ఫ్యూతో పాటు సెక్షన్ 144 అమల్లో ఉన్నందున సభలు, సమావేశాలు, పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించరాదని జీవీ ఆంజనేయులుకు నోటీసులు అందించారు.
ఇదీ చదవండి: