Promise Day 2023: ప్రమాణాన్ని (Promise) ఏదో ఒక సందర్భంలో మనుషులు వాడుతూనే ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చినవి కొనిస్తా అని చెప్తారు. కాస్త పెద్దయ్యాక పదో తరగతి, ఇంటర్, లేదా ఇతర ఉన్నత చదువులు పాస్ అయితే బైక్, కార్, ఫోన్ ఇతర వస్తువులు ఇప్పిస్తా అని మాట ఇస్తారు. పుట్టిన రోజు, పెళ్లిరోజు లాంటి ముఖ్యమైన రోజులకు బంగారం, ఆభరణాలు చేయిస్తా అని చెబుతారు.
ఏది ఏమైనా ప్రాధాన్యమే వేరు. ఇద్దరు మనుషుల్ని కలపడానికి లేదా ఎదుటి వాళ్లను సంతృప్తి పరచడానికి వివిధ రకాల వాగ్దానాలు చేస్తారు. ఇవన్నీ సరే కానీ.. ప్రామిస్‌ను మనిషి జీవితంలో అతి ముఖ్యమైన సందర్భంలో ఉపయోగిస్తారు. అదేంటి అనుకుంటున్నారా.. వివాహ సమయం. ఇద్దరు మనుషుల్ని ఒకటి చేసేటప్పుడు నమ్మకాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు.
దాదాపు ప్రతి మతంలోనూ పెళ్లి సమయంలో ఇద్దరి చేత ప్రమాణాలు చేయిస్తారు. కలిసి జీవితంలో పంచుకోబోయే వాళ్లు.. ఒకరికొకరు ఎలా చూసుకుంటారు ? ఎలా ఉంటే బాగుంటుంది అనే అంశాలు అందులో ఉంటాయి. అది ఏ మతమైనా సరే. ప్రామిస్‌ను బలంగా నమ్ముతారు. మన దేశంలోని మూడు ప్రధాన మతాల్లో పెళ్లి సమయంలో ఎలాంటి ప్రమాణం చేయిస్తారో తెలుసుకుందాం.
Promise in Hindu Marriage: హిందూ మతం ప్రకారం.. వివాహం జరిగే సమయంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె.. " ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి " అని ప్రమాణం చేస్తారు. దీని అర్థం ఏంటంటే.. ధర్మంలో, సంపద, శారీరక సుఖ విషయంలో గానీ, మోక్షం విషయంలో గానీ నిన్ను విడిచి పెట్టను. తరువాత జరిగే మాంగళ్య ధారణ జరిగే సమయంలోనూ ప్రమాణం లాంటి మంత్రాలనే జపిస్తారు.
Promise in Christian Marriage: క్రైస్తవ వివాహ విధానం ప్రకారం.. వధూ వరులిద్దరూ ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆ వివాహాన్ని జరిపే పెద్దలు వారిచే ఈ విధంగా ప్రమాణం చేయిస్తారు. " నేను నిన్ను ఇది మొదలుకుని దేవుని నిర్ణయం చొప్పున మేలులో, కీడులో, కలిమిలో, లేమిలో, వ్యాధి బాధల్లోనూ నిన్ను ప్రేమించి, సంరక్షిస్తాను". అంటే.. ఎలాంటి సమయాల్లో నూ నీ చేయి విడవకుండా నిన్ను ప్రేమిస్తాను అని అర్థం.
Promise in Muslim Marriage: ఇస్లాం విధాన వివాహంలో ప్రత్యేకించి ప్రమాణం ఏం ఉండదు. ఆ సమయంలో ఇరు కుటుంబాల పెద్దలు పాల్గొంటారు. అమ్మాయి కుటుంబం వారు అబ్బాయిని " మా కూతుర్ని చేసుకోవటం మీకు ఇష్టమా " అని అడుగుతారు. దానికి అబ్బాయికి నచ్చితే ఇష్టమే అని చెప్తారు. ఈ ప్రమాణాలు అన్ని అందరూ చేస్తారు. కొందరే నిలబెట్టుకుంటారు. అందులో మీరూ ఉండేలా చూసుకోండి.
ఇవీ చదవండి: