villagers reunion in adilabad district: గ్రామం కేవలం ఇళ్లు, మనుషులు మాత్రమే కాదు జ్ఞాపకాలు అన్నాడో సినీ దర్శకుడు. అచ్చం అలానే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలం తోయగూడ గ్రామస్థులు మధురానుభూతులను కైవసం చేసుకున్నారు. జైనథ్ మండలం సాత్నాల వద్ద 1984లో ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. ప్రాజెక్టు ముంపులో భాగంగా గ్రామాన్ని ఖాళీచేసిన తోయగూడవాసులు బతుకు దెరువు కోసం.. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. సారవంతమైన భూములు, ఇళ్లను కోల్పోయి వివిధ ప్రాంతాల్లో స్ధిరపడ్డారు.
ఎక్కడకు వెళ్లినా పుట్టిన గ్రామం తాలుకూ జ్ఞాపకాలు వారి మనస్సును వీడిపోలేదు. ఎక్కడెక్కడో నివాసం ఉన్న సుమారు 500 మందికిపైగా 39ఏళ్ల తర్వాత ఖాళీ చేసిన గ్రామశివారులో కలుసుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని కన్నీటి పర్యంతమయ్యారు. డప్పు వాయిద్యాల నడుమ గ్రామదేవతలకు పూజలు నిర్వహించారు.
"పాత తోయిగూడ అంటే నియోజకవర్గంలోనే గొప్ప గ్రామం. నేను ఇక్కడే జన్మించాను. తాతలు, తండ్రులు, మా తరం వాళ్లం ఎంతో క్రమశిక్షణతో మెలిగాం. ఎంతో సోదరభావం, ఆప్యాయతను పంచిన గ్రామాన్ని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఇక్కడి వారు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇవాళ వారిని కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఈ అనుభూతి జీవితంలో మర్చిపోలేనిది". -గద్దల శంకర్ సామాజిక కార్యకర్త
దాహంతీర్చిన బావి, చదువుకున్న బడి ఆనవాళ్లను వారి పిల్లలకు చూపిస్తూ మురిసిపోయారు. గత జ్ఞాపకాలను పదిలపరుచుకునేలా చరవాణుల్లో స్వీయ చిత్రాలు తీసుకున్నారు. చిన్నా, పెద్ద తేడా మరిచి ఆడిపాడుతూ ఉత్సాహంగా గడిపారు.దాదాపు మూడు దశాబ్దాల తర్వాతా గ్రామస్థులంతా కలిసి భోజనాలుచేసి ఆటపాటలతో ఆత్మీయతను పంచుకున్నారు.
"కులమతాలకు అతీతంగా గ్రామంలో అంతా ఒకే కుటుంబంగా జీవించాం. మా తల్లిదండ్రులు బాగా పెంచారు. ఇక్కడే ఏళ్లుగా కలిసిమెలిసి చదువుకున్నాం. ప్రాజెక్టుతో విడిపోయి ఎక్కడెక్కడో జీవిస్తున్నాం. ఆత్మీయ సమ్మేళనంతో 39 ఏళ్ల తర్వాత ఒక చోట కలుసుకోవడం అనందంగా ఉంది. మా ఊరి జ్ఞాపకాలను ఇప్పటికి మరిచిపోలేకపోతున్నాం". -విజయ పాత తోయిగూడ గ్రామస్థురాలు
ఇవీ చదవండి: