గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భోగి పండగ సందర్భంగా బుధవారం రాత్రి 11.30 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుడికి తాళాలు వేసి వెళ్లారు ఆలయ అర్చకులు. అనంతరం దుండగులు దేవాలయ తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. భద్రకాళి, భ్రమరాంబ అమ్మవార్ల మెడలోని 2 మంగళసూత్రాలు, ముక్కుపుడకను దొంగిలించారు. గురువారం తెల్లవారుజామున పూజలు నిర్వహించడానికి వచ్చిన పూజారి నాగ మల్లేశ్వర శర్మ... దొంగతనం జరిగినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఈపూరు ఎస్సై సింగయ్య దేవాలయాన్ని సందర్శించి వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు వినుకొండ మాజీ శాసన సభ్యుడు, నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విషయం తెలుసుకుని ఆలయాన్ని సందర్శించారు. ఇది దొంగల పనేనా?... లేదంటే అరాచక శక్తుల పనో పోలీసులు త్వరగా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి