అంబుజా యాజమాన్యం సిమెంటు కర్మాగారం నిర్మించే వరకు పరిశ్రమ నిర్మాణానికి తాము ఇచ్చిన పొలాలను సాగు చేసుకుంటామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. మే డే రోజున అంబుజా యాజమాన్యం కర్మాగారం నిర్మాణానికి 1997లో సేకరించిన భూముల్లోకి రైతులు ప్రవేశించారు. పొక్లెయిన్ సాయంతో చెట్లను తొలగించారు. అరక దున్ని సాగు ప్రయత్నాలు మొదలు పెట్టారు. బూదవాడు, గోగులపాడు, అంబాపురం, కొత్త అంబాపురం గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున అక్కడకు చేరుకొని రైతాంగానికి మద్దతు పలికారు.
25 ఏళ్లుగా అనేక సార్లు రైతులతో చర్చించిన అంబుజా యాజమాన్యం పరిశ్రమ నిర్మించడానికి తేదీలను ప్రకటించి విఫలం అయిందని రైతు సంఘ నేత మక్కెన అమరకృష్ణ తెలిపారు. దీంతో విసుగు చెందిన రైతులు గతంలో సిమెంటు కర్మాగారం కోసం ఇచ్చిన భూమిలో సాగు మొదలు పెట్టారని చెప్పారు. ఇది పొలాల ఆక్రమణ కాదని, సాగు చేసుకోవడానికి మాత్రమేనని తెలిపారు. అంబుజా యాజమాన్యం పనులు ఎప్పుడు ప్రారంభిస్తే అప్పుడు వెంటనే భూములను అప్పగిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు ఆరికట్ల శ్రీనివాసరెడ్డి, గోగులపాడు సర్పంచి నంద్యాల రామిరెడ్డి, బూదవాడ సర్పంచి రామిశెట్టి వెంకట్వేర్లు, ఉప సర్పంచి శ్రీపతి నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు చెన్ను కాశిరెడ్డి, పాశం హనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి