KR Suryanarayana Suspended: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న కేఆర్ సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఏపి ప్రభుత్వం ప్రొసీడింగ్స్‌ను జారీ చేసింది. క్రమశిక్షా చర్యలు పూర్తయ్యేంత వరకూ ఆయనపై సస్పెన్షన్ ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంటూ రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. 2019 నుంచి 2021 మధ్య కేఆర్ సూర్యనారాయణతో పాటు సహ ఉద్యోగులు, మెహర్ కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణలు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని ప్రభుత్వం అభియోగం మోపింది.
ఏపీ జీఈఏ, ఏపీ కమర్షియల్ టాక్సెస్ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణ వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ప్రభుత్వం అభియోగాల్లో పేర్కొంది. వీటిపై విజయవాడ సిటీ పోలీసులు కూడా కేసు నమోదు చేశారని అయితే ఆయన ఇప్పటికీ విచారణకు సహకరించకుండా పరారీలో ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో ప్రజాప్రయోజనాల రీత్యా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా విజయవాడ ను వీడి వెళ్లొద్దంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
KR Suryanarayana Anticipatory Bail Petition Cancelled: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విజయవాడలోని అనిశా కోర్టు జులై 17న కొట్టివేసింది. ఈ మేరకు ఏసీబీ న్యాయస్థానం జడ్జి హిమబిందు జులై 17న తుది ఉత్తర్వులు ఇచ్చారు. వాణిజ్య పన్నులశాఖ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో నలుగురు ఉద్యోగులతో పాటు ఐదో నిందితుడిగా కేఆర్ సూర్యనారాయణపై విజయవాడలోని పటమట పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని సూర్యనారాయణ.. జూన్‌లో విజయవాడ 12వ అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించారు. అనుకూలంగా తీర్పు రాకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపి జులై 7లోపు నిర్ణయం వెల్లడించాలని అనిశా కోర్టును హైకోర్టు ఆదేశించింది. నిర్ణయం వెలువడే వరకు సూర్యనారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేఆర్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై అనిశా కోర్టులో గత వారం వాదనలు జరిగాయి. తుది ఉత్తర్వులు జులై 17న జారీ అయ్యాయి.
ముందస్తు బెయిల్‌పై హైకోర్టుకు: ముందస్తు బెయిల్ కోసం ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులకు హైకోర్టు వాయిదా వేసింది. ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చారని పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.