U-1 ZONE: గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి గ్రామాల్లో విధించిన యూ వన్ జోన్‌ను ఎత్తివేయాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 100వ రోజుకి చేరాయి. తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట 3 గ్రామాల రైతులు నిరసన తెలిపారు. వీరికి తెలుగుదేశం, జనసేన, వామపక్ష నేతలు మద్దతు పలికారు. గతంలో 24 గంటల్లో జోన్ ఎత్తేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ..ఇప్పుడు సమస్యను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి నెల రోజులు దాటినా అధికారులు ఎలాంటి సమాధానాన్ని ఇవ్వలేదని అన్నదాతలు మండిపడ్డారు.
యూ-1 జోన్ అంటే..: గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి పరిధిలోని అమరానగర్ ప్రాంతంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్‌గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యూ-1 జోన్ ఎత్తివేస్తామని వైకాపా నేతలు హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్‌ను సైతం కలిశారు. 2 నెలల్లో ఎత్తివేస్తామని చెప్పారని.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. జాతీయ రహదారిని అనుకొని ఉన్న తమ భూములను అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.
ఇవీ చదవండి: