Tension at Vijayawada Ilapuram Hotel: విజయవాడలోని హొటల్ ఐలాపురం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర మహిళా కమిషనర్‌ను కలిసేందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ మహిళా, జనసేన వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో.. మహిళలపై జరుగుతున్న దాడులు వివరించేందుకు ఐలాపురం హోటల్‌కు బయలుదేరిన మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో వంగలపూడి అనిత, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహిళలపై దాడులు, సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులపై సమావేశం జరుగుతుంటే తమకు అనుమతి ఎందుకు లేదంటూ టీడీపీ, జనసేన వీర మహిళా నేతలు ప్రశ్నించారు. తాము శాంతియుతంగానే వెళ్లి మహిళలు ఎదుర్కొన్న సమస్యలు మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నా పోలీసులు అనుమతించట్లేదని మండిపడుతున్నారు. దీంతో తెలుగుదేశం-జనసేన మహిళా నేతలు హోటల్ బయట నిరసన తెలుపుతున్నారు.
TDP And Janasena Leaders Fires on Vasireddy Padma: ఈ క్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పెట్టుకుని మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ "సోషల్ మీడియా - మహిళలపై దాడి" అంశంపై సమావేశం పెట్టుకున్నారా అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. తాము కూడా వినతి పత్రం ఇస్తామంటే హాల్ నిండిపోయింది అని సమాచారం ఇవ్వటమేంటని ప్రశ్నించారు. హాల్ నిండిపోతే వాసిరెడ్డి పద్మ కిందకి వచ్చి తమ వినతిపత్రం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ విజ్ఞాపన తీసుకోకుండా ఇక్కడి నుంచీ కదిలేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు ప్రాతినిధ్యం లేకుండా వాసిరెడ్డి పద్మ ఎలా సమావేశం నిర్వహిస్తారని జనసేన మహిళా నాయకురాలు సౌజన్య నిలదీశారు. జనసేన తరఫున మహిళా కమిషన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
"మహిళల సమస్యలపై సెమినార్‌కు వెళ్తుంటే అడ్డుకుంటారా?. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పెట్టుకుని మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ "సోషల్ మీడియా - మహిళలపై దాడి" అంశంపై సమావేశం పెట్టుకున్నారా?. మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే హాల్ నిండిందని సమాచారం ఇస్తున్నారు.. ఒకవేళ హాల్ నిండిపోతే వాసిరెడ్డి పద్మ కిందకు వచ్చి మా వినతి పత్రాలు స్వీకరించాలి. మా వినతి పత్రాలు తీసుకోకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదు"-వంగలపూడి అనిత, తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు
ఆందోళనతో లోపలికి అనుమతి..: టీడీపీ, జనసేన మహిళా నేతలు ఆందోళన కొనసాగించడంతో పోలీసులు వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో వంగలపూడి అనిత మరికొంతమంది మహిళా నేతలు వెళ్లి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మకు వినతిపత్రం అందజేశారు. సోషల్ మీడియాలో టీడీపీకు చెందిన మహిళా నేతలపై మార్ఫింగ్ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్‌బీ పోలీసులమంటూ తెలుగు మహిళల పట్ల అనుచిత ప్రవర్తన: మహిళా కమిషన్ వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన తెలుగు మహిళల పట్ల ఎస్బీ పోలీసులమంటూ పలువురు అనుచితంగా ప్రవర్తించారు. సదురు వ్యక్తులు ఎంత డబ్బులిస్తే ఇక్కడకు వచ్చారంటూ మహిళల్ని ప్రశ్నించారు. ఎక్కడ నుంచి వచ్చారు, ఎంత డబ్బు ముట్టచెప్పారంటూ ప్రశ్నలకు చాకచక్యంగా సమాధానంలాగే యత్నం చేశారు. మీరెవ్వరంటూ వారిని ప్రశ్నించిన మహిళలు.. తాము ఎస్బీ పోలీసలమంటూ మఫ్టీలో ఉన్న వ్యక్తులు సమాధానం ఇచ్చారు. ఆగ్రహంతో తెలుగు మహిళలు సదురు వ్యక్తులపై దాడికి దిగారు. మహిళలు చెప్పులు తీసుకుని ప్రశ్నలు అడిగిన అతనిపై ఎదురు దాడికి దిగారు. తమని అవమానిస్తారంటూ తెలుగు మహిళలు చెప్పులతో వెంబడించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ప్రశ్నించిన వ్యక్తిని పక్కకు తప్పించి పంపేశారు.