Bail grants to MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పీడీ చట్టం కింద చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ రాజాసింగ్‌ను ఆదేశించింది. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించొద్దని కూడా షరతు విధించింది.
అదేవిధంగా 3 నెలల వరకు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టవద్దని ఆదేశించింది. బెయిల్ పత్రాలు సమర్పిస్తే ఈరోజే రాజాసింగ్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగస్టు 25న ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ చట్టం నమోదు చేసి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ సతీమణి ఉషాభాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కౌంటరు దాఖలు చేశారు.
ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ తరఫు న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించారు. పీడీ చట్టం కింద నమోదైన కేసులను కొట్టివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను రవిచందర్ ప్రస్తావించారు. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వాదించారు. ఇప్పటికే ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో 100కు పైగా కేసులు నమోదయ్యాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నిన్న ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.
అసలేం జరిగిందంటే: ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తక్షణమే తప్పిస్తున్నట్లు ప్రకటించింది.
పార్టీ నుంచి తనను ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే దానికి పూర్తి వివరణ ఇచ్చారు. అయితే భాజపా అధిష్ఠానం దీనిపై సంతృప్తి చెందక అతనిపై ఇంకా సస్పెండ్‌ను కొనసాగించింది. మరోవైపు ఇటీవలే పీడీయార్డ్ రివైజ్ కమిటీ కూడా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ఎత్తివేసేందుకు నిరాకరించింది.
ఇవీ చదవండి: