HC Allows SIT inquiry on MLAs bribing case : తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో.. దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతిస్తూ సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. భాజపా రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు విచారణ చేసింది. భాజపా తరపు న్యాయవాది.. తాము దర్యాప్తును నిలిపేయాలని కోరడం లేదని, మరో సంస్థకు అప్పగించాలని కోరామన్నారు. రిమాండ్‌డైరీ, పంచానామా తేదీల్లో తేడాను సింగిల్ జడ్జి సరిగానే గుర్తించారని పేర్కొన్నారు.
Telangana HC Allows SIT inquiry on MLAs bribing case : అధికార పార్టీ ఎమ్మెల్యేలను సీఎం కార్యాలయానికి తీసుకెళ్లారని, కేసు నమోదు చేయక ముందే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఫాంహౌస్ చేరుకున్నారని.. అక్కడే మీడియాతో మాట్లాడారని తెలిపారు. జాతీయ పార్టీ అయిన భాజపా ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు తెరతీశారని ఆరోపించారు. కేసులో పారదర్శక దర్యాప్తు కొనసాగనందున.. ఆప్రభావం జాతీయస్థాయిలో ఉంటుందని కోర్టుకు తెలిపారు. దర్యాప్తును మరో సంస్థకు అప్పగించాలని.. ఆ పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా కొంతకాలం దర్యాప్తును వాయిదా వేయాలని కోరుతున్నామని చెప్పారు.
SIT inquiry on MLAs bribing case : కేసుపై నమాదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేవేయాలని కోరడం లేదని వివరించారు. వాదనలు వినిపించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది.. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తును అడ్డుకోరాదని సుప్రీంకోర్టు పలుసార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇతరరాష్ట్రాల్లో భాజపా మంత్రులను ఆరెస్ట్‌చేసి జైళ్లకు తరలించిందని, ఇక్కడ దర్యాప్తు జరుగుతుంటే ఆపాలని అడ్డుకుంటున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని ఆధారాలుండగా బాధ్యతాయుతమైన పార్టీ నిందితులకు అండగా నిలవడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు.
గత నెల 26న రాత్రి ఎనిమిదిన్నరకు.. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. మెదటి పంచనామా చేశారని, మరుసటి రోజు రెండో పంచనామా జరిగిందని చెప్పారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోని వివరాలు సేకరించడానికి సయమం పట్టిందని.. అందుకోసం పంచనామాల్లో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులపై అప్పీళ్ల విచారణార్హత పరిధి తక్కువని, ఈపిటిషన్ పరిధి పరిమితమని.. నిందితులపిటిషన్‌పై విచారణచేపట్టవచ్చని తెలిపారు.
అందువల్ల దర్యాప్తు కొనసాగించాలని, అప్పీల్ కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. దర్యాప్తును సిట్ ఆధ్వర్యంలో కొనసాగించాలని, నివేదికను సింగిల్ జడ్జికి సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ సమయంలో తెరాస అధ్యక్షుడి నుంచి తన కార్యాలయానికి ఒక సీల్డ్ కవర్ వచ్చిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జుల్ భూయాన్ తెలిపారు. అందులో ఒక సీడీ, పెన్‌డ్రైవ్ తదితరాలు ఏవోఉన్నాయని, ఐతే వాటిని అలాగే సీజ్‌చేసి పక్కన ఉంచాలని చెప్పానన్నారు.
ఇలాగే కవర్ తనకూ అందిందని ఏంచేయాలని మరో రాష్ట్రహైకోర్టు ప్రధానన్యాయమూర్తి తనను సంప్రదించారన్నారు. స్పందించిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. అలా జరిగి ఉండాల్సిందికాదని.. బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఇలా విషయాలను వెల్లడించరాదన్నారు.
ఐతే అన్ని దర్యాప్తు సంస్థలు సమాచారం వెల్లడించడం సహజమైపోయిందని.. ఈడీ, సీబీఐ దర్యాప్తు అంశాలు, ఆధారాలను మీడియాకు వెల్లడిస్తున్నాయని తెలిపారు. రాజకీయ సమరాలకు న్యాయవ్యవస్థలను వేదిక చేయడం సరైన పద్ధతి కాదని సూచించారు. కేసీఆర్ నుంచి వచ్చిన కవర్ పట్టించుకోరాదని.. లేదంటే పడేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది సూచించారు. న్యాయమూర్తులకు సీల్వర్ కవర్లు పంపడం.. న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్నారడానికి నిదర్శనమని భాజపా తరపు న్యాయవాది పేర్కొన్నారు.
ఆ విషయంపై కోర్టు ధిక్కరణచర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని.. ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో రికార్డులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపినట్లు ప్రకటించారని.. ఇది తీవ్రమైన విషయమేనన్నారు. ఇక్కడ వినడానికి ఏమీ లేదని, అదంతా సృష్టించిన కేసు అని తెలిపారు.
ఇవీ చదవండి: