Teachers have not received salaries: ఒకటో తేదీ రావాల్సిన జీతం పదో తేదీ దాటినా ఖాతాలో జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. రుణ వాయిదాల తేదీలు మార్చాలని బ్యాంకులను కోరుతున్నారు. ఏ ఉద్యోగికైనా ప్రతినెలా రుణవాయిదాలు, ఇతర ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వం నుంచి జీతం ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితుల్లో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ రుణవాయిదా తేదీ మార్చాలని వైయస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగులో బ్యాంకు మేనేజర్‌కు ఉపాధ్యాయులు వినతిపత్రం సమర్పించటం వారి ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది.
ప్రభుత్వోద్యోగి ముఖంలో చిరునవ్వు కనిపిస్తేనే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఉద్యోగులకు రావాల్సినవన్నీ సరైన సమయానికి వచ్చేలా చేస్తానని ప్రతిపక్ష నేతగా జగన్ అనేక సభల్లో హామీలు ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు జీతమే సమయానికి రావట్లేదని ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితి జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందని సీఎం జగన్ ప్రకటించినా.. జీతాలు చెల్లించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.
చలో విజయవాడ తర్వాత ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయని, ప్రతినెలా జీతాలు ఆలస్యంగా వేయడం వెనుక ఆంతర్యం ఏంటని నిలదీస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఉపాధ్యాయులు మోకాళ్లపై నిల్చొని జీతాల కోసం నినాదాలు చేశారు. వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా పుత్తూరులో అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు.
ఇవీ చదవండి: