TDP will lodge complaint with EC over bogus votes: ఓటర్ల జాబితాలో వైసీపీ చేస్తున్న అక్రమాలు, ఫాం-6, 7 అవకతవకలపై తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం బృందం మంగళవారం దిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. బీఎల్వోలపై ఒత్తిడి తెచ్చి వైసీపీ నేతలు అక్రమాలకు తెర లేపుతున్నారనే అంశాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనుంది. దిల్లీకి వెళ్లే తెలుగుదేశం నేతల బృందంలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌లు ఉన్నారు.
అక్రమాలపై చర్యలు చేపట్టే దిశగా ఒత్తిడి తేవాలని నిర్ణయం: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఓట్ల నమోదు, తొలగింపు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయంటూ.. టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులను కలుస్తూ... ఓట్ల నమోదు ప్రక్రియలో అక్రమాలపై వివరాలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఓట్ల తొలగింపు, నమోదులో వైసీపీ ప్రలోభాలు తగ్గడం లేదంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు తగిన ఆధారాలను సైతం బయటపెడుతూ వస్తున్నారు. అధికార వైసీపీ మాత్రం టీడీపీ ఆరోపణలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ... తన పని తాను చేసుకుపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఓట్ల చేర్పులు, టీడీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు, ఓటర్ బూత్‌ల మార్పులు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మరో మారు టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల అధికారులను కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసి చర్యలు చేపట్టే దిశగా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.
15 వేల మంది మృతులకు ఓటు హక్కు! ఎక్కడో తెలుసా?
టీడీపీ ఆరోపణలు: ఇప్పటికే రాష్ట్రంలో నమోదైన దొంగ ఓట్ల వెనక స్క్రీన్‌ప్లే మొత్తం తాడేపల్లి ప్యాలెస్‌దేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్ల నమోదు వ్యవహారం అంతా రామ్ ఇన్‌ఫో 'ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరుతో జరుగుతోందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఫాం-7 వినియోగం పూర్తిగా ఎన్నికల కమిషనర్ పర్యవేక్షణలో ఉంచాలని టీడీపీ నేతలు కోరనున్నారు. ఓట్ల నమోదు, తొలగింపు కోసం ప్రభుత్వ డేటా బయటకి వెళ్తుందని టీడీపీ నేతలు ఆరోపించారు. గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి పూర్తిగా తొలగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. గ్రామ వాలంటీర్ల మానిటరింగ్‌కు "ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ"ని పెట్టారని టీడీపీ నేతలు విమర్శించారు. వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటా మొత్తం ఐప్యాక్‌కు చేరుతోందని ఆరోపించారు.
25వేల ఓట్లు తొలగించే కుట్ర: రాష్ట్రంలో టీడీపీ సానుభూతిపరుల ఓటు హక్కును హరించేందుకు.. పెద్ద కుట్ర జరుగుతోందని.. తెలుగుదేశం పార్టీ మెుదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. ఎంపిక చేసిన ప్రతి నియోజకవర్గంలో 25వేల ఓట్ల వరకూ తొలగించేందుకు... ఫేక్ సిమ్ కార్డు రాకెట్ నడిచిందని ధ్వజమెత్తింది. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలను వాడుకుని... వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీడీపీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో మారు టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల అధికారులను కలవడం ప్రాధాన్యత సంతరించుకోనుంది.
'నేటికీ 33శాతం మంది ఓట్లు వేయడం లేదు - పోలింగ్ శాతం తగ్గితే ఓటు బ్యాంకు రాజకీయాలు'