TDP Protests Against Chandrababu Arrest: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా విజయనగరం జిల్లా రాజాంలోని తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కొండ్రు మురళి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో టీడీపీ నేతలు చంద్రబాబుకు మద్దతుగా జల దీక్ష చేశారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో వంశధార నదిలోకి దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నరసన్నపేట మండలం తామరపల్లిలో మహిళలు నిరసన తెలిపారు. బాబుతో మేము అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనకాపల్లి జిల్లా తుమ్మపాల గంగాలమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ.. ఆలయం బయట కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేటలోని కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొని చంద్రబాబు నామ గోత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీరామ్ తాతయ్య పూజలు నిర్వహించారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి తెలుగు మహిళలు గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రబాబు త్వరగా బయటకు రావాలని వేడుకున్నారు. చందర్లపాడులో తెలుగుదేశం శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపాయి.
ప్రతిపక్ష పార్టీల వారిపై కేసులు పెట్టడం, ముఖ్య నేతల్ని జైల్లో పెట్టడం ద్వారా.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వికృత క్రీడ ఆడుతున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని, త్వరగా జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ గుంటూరు నార్త్ ప్యారిస్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి చేస్తున్న సైకిల్ యాత్ర పదో రోజుకు చేరింది.
బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి నుంచి మిన్నేకల్లు వరకు సుమారు 8 కిలోమీటర్లు సైకిల్ యాత్ర సాగింది. కర్నూలు జిల్లాలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. హాలహర్వి మండలం ఛత్రగుడి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. బాబు త్వరగా బయటకు రావాలని స్వామివారిని మొక్కుకున్నారు.