TDP MLCs Condemns Attack On TDP MLAs: శాసనసభలో తెలుగుదేశం ఎమ్మెల్యేలపై దాడిని నిరసిస్తూ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలిని బహిష్కరించి బయటకు వచ్చేశారు. చట్టాలు చేసే సభల్లోనే సభ్యులపై దాడులా అంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో జగన్ రెడ్డి పూర్తిగా దిగజారాడని ఆరోపించారు.
దళితులతో దళితుడిపై దాడి చేయించడం నీచమని దుయ్యబట్టారు. కుల విధ్వేషాలు రెచ్చగొట్టడానికే టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై దాడి చేయించారని విమర్శించారు. స్వామిపై.. గతంలో మేరుగ నాగార్జున, ఇప్పుడు సుధాకర్ బాబు దాడి చేయడం చూస్తుంటే జగన్ రెడ్డి పెత్తందారీతనం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
"చట్టాలు చేసే సభల్లోనే సభ్యులపై దాడులా?. శాసనసభ చరిత్రలో అధికార పక్షం ఇంతలా దిగజారుతుందా?. ఎస్సీ, ఎస్టీలను టీడీపీకు దూరం చేయడానికే జగన్ కుట్ర. వివేకా హత్య కేసుపై ప్రజల దృష్టి మళ్లించేందుకే మాపై దాడులు"-యనమల రామకృష్ణుడు, టీడీపీ నేత
ఏపీ శాసనసభ చరిత్రలో అధికారపక్షం ఇంతలా దిగజారడం ఎన్నడూ చూడలేదని యనమల అన్నారు. ఎస్సీ, ఎస్టీలను తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి జగన్ రెడ్డి కుట్ర పన్నాడని విమర్శించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ప్రజల దృష్టి మళ్లించడానికే జగన్ రెడ్డి శాసనసభను వాడుకుంటున్నాడని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
మా పై జరిగిన దాడి .. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడికి నిదర్శనం: చట్టసభల్లోనూ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీలు బీ.టి.రాయుడు, అశోక్‌బాబు, అంగర రామ్మోహన్ ఆక్షేపించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. చట్ట సభల్లో మాట్లాడుతున్నా ఎమ్మెల్యేలపై దాడి చేస్తారా అంటూ దుయ్యబట్టారు. చట్టసభల్ని కూడా నిర్వీర్యం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరింట్లోనూ ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీలు విమర్శించారు.
"చట్టసభల్లో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలపై దాడులు చేయడం హేయమైన చర్య. జీవో నెం 1 కు వ్యతిరేకంగా ఈరోజు విపక్షాలు అన్ని కూడా చలోఅసెంబ్లీకి పిలుపునకు అనుగుణంగా వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. చలోఅసెంబ్లీకి పిలుపు ఇవ్వగానే వేల మందిని గృహ నిర్బంధాలు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. జీవో నెం1 కచ్చితంగా రద్దు చేయాలి"-అశోక్‌బాబు, టీడీపీ ఎమ్మెల్సీ
శాసనమండలిలో కూడా మాట్లాడే హక్కు లేదా: తెలుగుదేశం ఎమ్మెల్యేలపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలిని బహిష్కరించి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జీవో నెంబర్ 1 వల్ల బయట మాట్లాడటానికి లేదు.. కనీసం శాసన మండలిలో కూడా మాట్లాడనివ్వరా అంటూ MLC లు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న జీవో నం.1ను వెంటనే రద్దు చేయాలని MLC లు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: