TDP Leaders Shocking Comments On CM Jagan : తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయనను అరెస్టు చేయగానే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారన్నారు. జగన్ ను అరెస్టు చేసినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ బయటకు రాలేదని తెలిపారు. చంద్రబాబు అరెస్టు విషయం బూమరాంగ్ అయ్యింది కాబట్టి నాటకాలు ఆడారన్నారు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు పోలీసులు ఎత్తివేశారని చెప్పుకొచ్చారంటూ విమర్శించారు. అమిత్ షా దేశానికి కేంద్రమంత్రి కాబట్టి ఆయన్ను కలిసి అన్ని వివరాలనూ లోకేశ్ వివరించారని తెలిపారు. అరెస్టు విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదనీ అమిత్ షా చెప్పారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ప్రకృతి వనరులను దోచుకోడానికి: సీఎం జగన్ ఉత్తరాంధ్రను, విశాఖను మరోమారు మోసం చేశారంటూ అచ్చెన్నాయుడు(Atchannaidu) మండిపడ్డారు. ముఖ్యమంత్రి విశాఖలో ఉంది అక్కడ భూములు దోచుకోవడం తప్ప దేనికని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆపడానికి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. అక్కడి ప్రాజెక్టులకు ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రకృతి వనరులను దోచుకోడానికి తప్పితే జగన్ దేనికి వెళ్తున్నారని మండిపడ్డారు. జగన్ కు బెంగుళూరు, తాడేపల్లి, హైదరాబాద్ లో కొంపలు ఉన్నాయన్నారు. ఆయన రుషి కొండపై కూర్చునేది ఇతరుల ఆస్తులు దోచుకోడానికని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
నమ్మి ఓట్లు వేస్తే...: శాఖను కార్యనిర్వాహక రాజధాని అని చెప్పిన సీఎం జగన్... ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) నిలదీశారు. జగన్ ఎన్నికలకు ముందు ఒకమాట.. ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పిచారు. జగన్ ను నమ్మి ఓట్లు వేస్తే... అధికారంలోకి వచ్చాక అన్ని ప్రాంతాలను మోసం చేస్తున్నారని గంటా వ్యాఖ్యానించారు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు మరచిపోయారా... జగన్ అంటూ గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుషికొండలో క్యాంపు కార్యాలయం: చంద్రబాబు పూర్తి చేసిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులేసి గొప్పగా చెప్పుకుంటుందని... తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna)విమర్శించారు. ఎన్నికలు వస్తున్నందునే.. పూర్తి చేయని ఇళ్లకు జగన్ గృహప్రవేశాలు చేసి ప్రజలను మోసగిస్తున్నారన్నారు. రాష్ట్రం అప్పుల్లో మునుగుతుంటే.. 270 కోట్లు వెచ్చించి రుషికొండలో విలాసవంతమైన క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. 2లక్షల 35 వేల కోట్ల రూపాయలు జగన్ దోపిడీ చేశారని. వీటికి లెక్కలు చెప్పాలని అన్నారు. రాష్ట్రం అప్పులు 11 లక్షల కోట్లు దాటాయని.. చెప్పారు. రాష్ట్రంలో అప్పులు ఎక్కువ.. అభివృద్ధి మాత్రం శూన్యమని యనమల అన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ అనారు. విశాఖ రాజధాని పేరుతో కోట్లాది రూపాయలు దోచేశారని వైసీపీ నేతలు ఎన్ని పన్నాగాలు పన్నినా చంద్రబాబు బయటకు వస్తారని జవహర్ అన్నారు.