TDP LEADERS FIRE ON GO : ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణగదొక్కేందుకే జీవో నెం.1 అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. గతంలో ప్రభుత్వ వైఫల్యాలను పత్రికలు, మీడియా బయటపెడుతున్నాయనే కక్షతో జీవో నెం.2430 తెచ్చారని విమర్శించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని.. అందుకే ఈ నిరంకుశ నిర్ణయాలంటూ మండిపడ్డారు.
ప్రజలు, పత్రికలు, ప్రతిపక్షాలు.. ప్రభుత్వాన్ని నిలదీయకూడదనడం ప్రజాస్వామ్యాన్ని హరించడమేనన్నారు. చంద్రబాబునాయుడు సభలకు వస్తున్న ప్రజల ప్రజాదరణ చూసి జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అచ్చెన్న విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు నిరసన తెలియజేసే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు.
అర్ధరాత్రి ఇచ్చిన జీవో నాలుకు గీసుకోవడానికి కూడా పనికిరాదు: ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అవసరమైన భద్రత కల్పించకుండా ప్రజల ప్రాణాలు బలిగొంటున్నది జగన్‌రెడ్డి కాదా అని నిలదీశారు. నాడు జగన్‌రెడ్డి సభలు, పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే జగన్‌రెడ్డి ఇంట్లో నుంచి కాలు బయటపెట్టేవాడా అంటూ మండిపడ్డారు. అప్రజాస్వామికమైన జీవో నెం.1 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సభలు, ర్యాలీల నియంత్రణపై అర్ధరాత్రి ఇచ్చిన తుగ్లక్ జీవో నాలుక గీసుకోవటానికి కూడా పనికి రాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఇవాళ సభలు ఎక్కడ పెట్టాలో చెప్తున్నవారు, రేపు ఆ సభల్లో ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ రాసిస్తారా అంటూ మండిపడ్డారు. తామైతే తగ్గేదెలేదనీ, యథావిథిగా సభలు, ర్యాలీలు నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు.
సభలు, ర్యాలీలు నియంత్రించాలని చూడటం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనన్నారు. ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పాటైన ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను అడ్డుకునే చర్యలను న్యాయబద్ధంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. చీకటి జీవో అమలు చేయాలనుకునే అధికారులు నేటి సీఎం తూర్పుగోదావరి పర్యటనను అడ్డుకోవాలన్నారు. ఇవాళ రాజమహేంద్రవరంలో సీఎం రోడ్డు షోకు ఎలా అనుమతులిచ్చారని నిలదీశారు.
జీవోలు కేవలం ప్రతిపక్షాలకేనా.. అధికార పక్షానికి కాదా: సభలు, రోడ్డుషోలపై ఆంక్షలు విధించడం చూస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటే జగన్ భయపడుతున్నాడని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ కుట్ర ఫలితమే కందుకూరు, గుంటూరు సంఘటనలని ఆరోపించారు. జీవోలు, 30 యాక్ట్లు ప్రతిపక్షానికే వర్తిస్తాయి కానీ.. అధికార పక్షానికి వర్తించవా అని నిలదీశారు.
రోడ్ షో చేయకూడదని ఆంక్షలు విధించిన జగన్.. నేడు రాజమండ్రిలోని మున్సిపల్ స్టేడియం నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు ఎట్లా రోడ్ షో నిర్వహించాడని ప్రశ్నించారు. ప్రజా గొంతుకను అణిచివేయాలనే ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్టు చేసినా, ఎంత మందిని జైల్లో పెట్టినా లక్షలాది మందిగా సభలకు వస్తాం, రోడ్డెక్కుతామని నిమ్మల హెచ్చరించారు.
ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవోలను పట్టించుకోము: 2024 ప్రత్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు వెనుక కూర్చుని ఆయన్ని అవమానించిన వారి అంతు చూస్తానని హెచ్చరించారు. తాను, నాగుల్ మీరా ఇద్దరం ఈసారి చట్ట సభల్లో అడుగుపెడతామని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవోలు పట్టించుకోమని స్పష్టం చేశారు. పార్టీలో ఏ పదవి లేకుండానే కేశినేని చిన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న బుద్ధా.. చిన్నీకి పదవి ఉంటే పేదలకు మరింత లాభమని తెలిపారు. వైసీపీ నేతలే మనుషుల్ని పంపి తెలుగుదేశం సభల్లో తొక్కిసలాట సృష్టించారని ఆరోపించారు.
కాలం చెల్లిన బ్రిటిష్ చట్టాలను ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. రోడ్లపై సమావేశాలను పెట్టకూడదని.. ఈ రోజు రాజమండ్రిలో సీఎం రోడ్డు షో ఎలా పెట్టారని నిలదీశారు. రాజమండ్రిలో సీఎం సభకు బలవంతంగా రావాలి అని మహిళలను వాలంటీర్లు బెదిరిస్తున్నారంటూ గోరంట్ల ఓ ఆడియో విడుదల చేశారు.
జగన్ ముద్దుల పర్యటనలు చేసినప్పుడు ఇరుకు సందుల్లో సభలు పెట్టలేదా: సీఎం సభ కోసం ముసలివాళ్లను కూడా వదలడం లేదని, కందుకూరు, గుంటూరు రెండు సభల్లో జరిగిన ఘటన సీఎం జగన్ కుట్ర అని ఆక్షేపించారు. జగన్ ముద్దుల పర్యటనలు చేసినప్పుడు ఇరుకు సందుల్లో సభలు పెట్టలేదా అని గోరంట్ల ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేసినప్పుడు తొక్కిసలాటలో చనిపోయిన వారి సంగతేంటని నిలదీశారు. సీఎం జగన్కు శాశ్వత రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
సీఎం జగన్ అబద్ధాలు చెప్పడంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. మూడు వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన జగన్.. మోసం చేశారని ధ్వజమెత్తారు. 1000 రూపాయల పెన్షన్ను రెండు వేల రూపాయలుగా చంద్రబాబు ఇస్తే.. తాను ఇస్తున్నట్లు జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
పథకం ప్రకారమే చీకటి జీవో: నరహంతకుడు జగన్.. చంద్రబాబు కాదని తెలిపారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు 13 మందిని చంపి ఒక జీవో తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు, గుంటూరు ఘటనల కుట్ర వైసీపీ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. వైసీపీ మనుషులే చంద్రబాబు సభల్లోకి దూరి టీడీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. ఒక పథకం ప్రకారం 13మందిని చంపి చీకటి జీవో తీసుకువచ్చారని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: