TDP leaders protest: ఏపీలో విద్యుత్ బాదుడు అంటూ.. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద తెలుగుదేశం శాసనసభ పక్షం నిరసన తెలిపింది. స్మార్ట్ మీటర్ల పేరుతో రైతు మేడకు ఉరితాళ్లు బిగిస్తున్నారంటూ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. జగన్ సీఎం అయ్యాక ఏపీలో పవర్ హాలిడే ఇచ్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల పవర్ సెక్టార్ కుప్పకూలిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చేతిలో కొందరు అధికారులు కీలుబొమ్మలా మారారని ఆక్షేపించారు. రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. పులివెందులలో గెలుస్తున్నామని తాము ముందు నుంచి చెప్తున్నాం.. ఈ రోజు అదే జరిగిందని స్పష్టం చేసారు.
రోజుకి 18 గంటలు కరెంటు లేని పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. పరిశ్రమలకు కరెంటు లేక మూతపడి పవర్ హాలీడే ఇచ్చిన పరిస్థితి వచ్చింది. గతంలో చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తరువాత.. ఒక్క పైసా చార్జీలు పెంచకుండా ఐదు సంవత్సరాలు విద్యుత్ సరఫరా చేసిన ఘనత చంద్రబాబుది.. ప్రజలు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. దాదాపుగా 42 వేల 872 కోట్ల రూపాయలు భారం వేశారు. పాత బకాయిలు అని చెప్పి ఈ రోజు ఇంత భారం మోపడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. మొత్తం విద్యుత్ వ్యవస్థని అస్తవ్యస్తం చేశారు.- అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
వారి తరపున పోరాడుతాం.. బేడ, బుడ్గ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఎప్పుడు ఇస్తారంటూ టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద నిలబడి గంటన్నర పాటు ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేసారు. జీవనోపాధి లేక విద్య ఉద్యోగాలు పథకాలు అందని బేడ, బుడ్గ జంగం సమస్యలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదని నిలదీశారు. కుల సర్టిఫికెట్లు అందక జీవించే హక్కు, నివసించే హక్కు, విద్యా హక్కులను బేడ, బుడ్గ జంగం కులస్తులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక, మైన్, వైన్, లాండ్ ధనార్జన మీద ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టడం కాదు, నిరుపేదలపై కూడా దృష్టి పెట్టాలని హితవు పలికారు. అసెంబ్లీ నుండి మమ్మల్ని సస్పెండ్ చేస్తే.. నిన్న రాష్ట్రంలో జరిగిన సెమీఫైనల్స్ ఎన్నికలలో మిమ్మల్ని ప్రజలే సస్పెండ్ చేసారని ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరచి.. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బేడ, బుడ్గ, జంగం కులస్తులకు ఏవైతే హామీలు ఇచ్చారు.. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునే ఎస్సీ సర్టిఫికెట్లు అందజేస్తానని మీరు మాట ఇచ్చారో.. ఈ రోజు అధికారంలోకి వచ్చాక మాట తప్పి.. మడం తిప్పి బేడ, బుడ్గ, జంగం కులస్తులు అంటే ఎవరో తెలియని విధంగా ఈ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కళ్లు తెరిపించే విధంగా బేడ, బుడ్గ, జంగం కులస్తుల తరపున తెలుగుదేశం పోరాడుతుంది.- నిమ్మల రామానాయుడు, టీడీపీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: