దేశ రాజకీయ చరిత్రలో వర్చువల్‌గా ఒక రాజకీయ సమావేశం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీనేనని ముఖ్యనేతలు తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టడమే ప్రధాన అజెండాగా మహానాడులో తీర్మానాలు ఉంటాయని వారు వెల్లడించారు.
ప్రధాన సమస్యలు చర్చిస్తాం
రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై మహానాడు చర్చిస్తుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వెల్లడించారు. అన్ని రంగాలను వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్న ఆయన.. ఏడాది పాలనలో అభివృద్ధి సున్నా అని విమర్శించారు. ఏ రంగం అభివృద్ధిపైనా దృష్టి సారించకపోగా... ఉన్న పథకాలకు కోత పెట్టారని మండిపడ్డారు.
నా ఇష్టం నా రాజ్యం అన్నట్లుగా జగన్ వ్యవహారం ఉంది తప్ప రాజ్యాంగ పరంగా ఎన్నికైన ప్రభుత్వంలా లేదని యనమల విమర్శించారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థలపైనా ఎదురుదాడి చేస్తున్నారన్న ఆయన.. పార్లమెంటరీ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
న్యాయవ్యవస్థపై ఎదురుదాడి చేసే ఘటనలు ఒక్క జగన్ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. న్యాయవ్యవస్థను సైతం అవమానపరచటం ఈ ప్రభుత్వానికే చెల్లిందని యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు.
వైఫల్యాలు ఎండగడతాం
ప్రభుత్వ ఏడాది వైఫల్యాలను మహానాడు వేదికగా ఎండగడతామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వర్చువల్‌గా నిర్వహించే తొలి అతిపెద్ద రాజకీయ సమావేశం ఇదేనన్నారు. సీఎం జగన్ మనస్తత్వం వల్ల రాష్ట్రం క్రిమనల్ మయమవుతోందని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవటం దురదృష్టకరమన్నారు. వైకాపా దూరాగతాలపై రాజీలేని పోరాటం చేస్తామని సోమిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:
'చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్లినట్టే ఉంది ప్రభుత్వ పరిస్థితి'