TDP Leaders fire on CID Chief Sanjay: మార్గదర్శిపై సీఐడీ చీఫ్ సంజయ్ రాజకీయ నేతలా చవకబారు విమర్శలు చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశంపై హైదరాబాద్లో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి కోర్టు ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి స్లిప్లు అందిస్తుంటే దానికి అనుగుణంగా సీఐడీ చీఫ్ మాట్లాడి తన స్థాయి దిగజార్చుకున్నారని ఆక్షేపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, సజ్జల డైరెక్షన్లోనే సంజయ్ పత్రికా సమావేశం నిర్వహించారని ధ్వజమెత్తారు. సంజయ్ రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే సీఐడీ బాధ్యతలకు రాజీనామా చేసి, వైఎస్సార్సీపీలో చేరి నిర్భయంగా విమర్శలు చేసుకోవచ్చని హితవు పలికారు. ఎవరి కళ్లలో ఆనందం చూడటానికో మార్గదర్శిపై విమర్శలు చేశారని మండిపడ్డారు. సీఐడీ చీఫ్ మీడియా సమావేశంపై డీఓపీటీకి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.
మార్గదర్శిపై మరక వెయ్యాలనే ఉద్దేశ్యం : రామోజీ రావు నెలకొల్పిన సంస్థలు తెలుగు నేలకు గౌరవం తెచ్చాయని.. తెలుగు వారి జీవితంలో భాగం అయ్యాయని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. మార్గదర్శిపై ప్రభుత్వ కుట్రలు చేస్తున్నాయని, కానీ వారు అనుకున్న ఫలితాన్ని ఇవ్వవని తేల్చి చెప్పారు. మార్గదర్శిపై మరక వెయ్యాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం కనిపిస్తోంది తప్ప ఆ సంస్థలో ఎటువంటి తప్పు కనిపించడం లేదని తెలిపారు. ప్రశ్నించే వారిపై కక్ష, కార్పణ్యాలకు పాల్పడే ప్రభుత్వ పెద్దల తీరు పెద్దగా ఆశ్యర్యం కలిగించలేదన్నారు. కానీ వాటిని నెరవేర్చేందుకు ఆలిండియా సర్వీసెస్ అధికారులు చేస్తున్న ప్రయత్నం విస్మయం కలిగిస్తోందని మండిపడ్డారు. త్వరలోనే వైఎస్ జగన్ అహంకారం కుప్పకూలుతుందని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సీఐడీ చీఫ్ సంజయ్ మార్గదర్శిపై మాట్లాటిన వీడియో ప్లే చేసి, బాలికలపై అత్యాచారాల ఘటనలను దారుణంగా పోల్చారని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత మండిపడ్డారు. ఐపీఎస్ అధికారి సంజయ్‌కు మహిళలపై ఏ మాత్రం గౌరవం లేదని విమర్శించారు. చాక్లెట్లు, కేకులు చూపించి అత్యాచారాలు చేస్తున్నారనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా జరిగిన అత్యాచారాల వివరాలపై పుస్తకం ముద్రించి ఇచ్చినా చర్యలు తీసుకోలేదని వివరించారు. ఫిర్యాదు లేకుండా ఎన్ని ఘటనలపై చర్యలు తీసుకున్నారో సీఐడీ చీఫ్ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఐడీ చీఫ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు.
సీఐడీ చీఫ్ ఎంత మంది మహిళలకు న్యాయం చేశారో చెప్పాలి : మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సీఐడీ చీఫ్ సంజయ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. మైనర్ బాలికలు చాక్లెట్ తాయిళాలకు ఆశపడి అత్యాచారాలు చేయించుకుంటారంటూ.. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. మహిళలకు జరిగే అన్యాయంపై పెద్ద ఉపన్యాసమే ఇచ్చిన సీఐడీ చీఫ్ సంజయ్ గత నాలుగేళ్లుగా అన్యాయం జరిగిన ఎంత మంది మహిళలకు న్యాయం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నం : రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా వైసీపీ రంగు పులుముకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపణలు చేశారు. మచిలీపట్నంలో ఓట్ల అవకతవకలపై ఫిర్యాదు చేస్తే ఒక్క అధికారి కూడా స్పందించిన పాపాన పోలేదని విమర్శించారు. తాము ఫిర్యాదు చేస్తే 'మీకేంటి సంబంధం ఓటరు వచ్చి ఫిర్యాదు చేసుకుంటాడు' కదా అని సమాధానం చెబుతారే తప్ప.. ఫిర్యాదు చేసిన దానిపై ఒక్కరంటే ఒక్క అధికారి కూడా చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఒక్కొక్క బూతులో దాదాపు 100 నుంచి 200 ఓట్ల అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ అవకతవకలతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బందరు ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నైజాన్ని తెలుసుకుని.. ఓటు ఉందో లేదో ఒక్కసారి సరిచూసుకోవాలని కోరారు.