TDP Leaders Comments on YSRCP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు చేరుకోవడంతో తెలుగుదేశం నాయకులు రాష్ట్రంలో పలుచోట్ల పాదయాత్ర చేశారు. నారా లోకేశ్‌కు సంఘీభావంగా.. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో.. మహిళలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని శ్రావణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.
వాడుకొని బలిచేయటం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య: తన అవసరాల కోసం ఎస్సీ, ఎస్టీలను వాడుకుని.. వారిని బలిచేయటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. సీఐడీ చీఫ్లుగా నాడు సునీల్, నేడు సంజయ్.. జగన్ ఆడిన వికృత క్రీడలో బలిపశువులయ్యారని ఆక్షేపించారు. ఇద్దరూ ఐపీసీ నిబంధనలు పక్కన పెట్టి వైసీపీ రూల్స్ అమలు చేసినందుకు సమస్యలు కొనితెచ్చుకున్నారని గుర్తుచేశారు. సీఎం ఒత్తిడి వల్లే సంజయ్ మార్గదర్శిపై చట్ట విరుద్ధంగా వెళ్లి ఇబ్బందులు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. ఇదే విషయం సంజయ్ న్యాయస్థానంలో ఎక్కడ చెప్తారోననే ఆయన్ని దాచిపెట్టి అనారోగ్యం డ్రామా ఆడుతున్నారనే ప్రచారం ఉందని పీతల తెలిపారు. సీఐడీ చీఫ్‌గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన పీఎస్ఆర్ ఆంజనేయులు అయినా.. సజ్జల, జగన్ చెప్పినట్లు చేయకుండా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ తన గౌరవం కాపాడుకోవాలని హితవుపలికారు.
జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది..: అమరావతి కేసుల విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌కు వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఖరేంటని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. రాజధానిని విధ్వంసం చేసి, ప్రజల్ని రోడ్డున పడేసి, యువత భవితను చిదిమేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడని ఎద్దేవా చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులతో పాటు, ఇళ్ల స్థలాల పేరుతో పేదల్ని వంచిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌లో సుప్రీంకోర్టు తీర్పు రాజధాని రైతులకు అనుకూలంగా వస్తే.. సెంటు పట్టాలు పొందిన పేదల పరిస్థితి ఏమిటని జగన్ ఎందుకు ఆలోచించరని నిలదీశారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్రానికి రాజధాని లేకుండా ఘనుడి పాలన ఎలా ఉంటుందో దేశమంతా తెలిసిందని ఆక్షేపించారు. దళిత రైతులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీకేసులు పెట్టి వేధించారని విమర్శించారు. దుర్మార్గపు ఆలోచనలు, దుష్టపాలనతో అమరావతిని బలితీసుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని స్పష్టం చేసారు.
TDP Bus Yatra: టీడీపీ తలపెట్టిన బస్సు యాత్ర రాష్ట్రంలో విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం గన్నవరంలో టీడీపీ నాయకుల బస్సు యాత్ర జరుగుతోంది. భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రలో మాజీ మంత్రులు నెట్టెం రఘురాం, దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్ర చేపట్టినట్లు నాయకులు వెల్లడించారు.