TDP Leaders Comments on Chandrababu Case: స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సీజేఐకి నివేదించింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు పాక్షిక విజయంగా భావిస్తున్నామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు.
రాజకీయ ప్రేరిపిత కేసు కాబట్టి, సీజే బెంచ్‌లో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని తేల్చిచెప్పారు. తీర్పు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం లభిస్తుందన్నారు. కేసులకు తాము భయపడమని తెలిపారు. వైసీపీ కార్యకర్తలా ఏఏజీ వ్యవహరించడం మానుకోవాలని సూచించారు.
చంద్రబాబుపై నిరాధార ఆరోపణలతో కేసు నమోదు చేశారన్నారు. సాక్ష్యాలు లేకుండా కేసు పెట్టారని, వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. భవిష్యత్తులో టీడీపికి తప్పక న్యాయం జరుగుతుందని, వైసీపీ గడ్డురోజులు తప్పవన్నారు. టీడీపీ శ్రేణులు ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నారు.
17ఏ వర్తింపు విషయంలో సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిందని, ఈ కేసు సుప్రీంకోర్టు సీజే వద్దకు వెళ్తోందన్నారు. ప్రధాన న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం చూడాలని, త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేస్తారా? లేక ఐదుగురితో ధర్మాసనం ఏర్పాటు చేస్తారా? రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తారో ఏం చేస్తారనేది త్వరలోనే తేలుతుందన్నారు.
Chandrababu Case Verdict: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ విషయంతో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు తెలిపారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నామని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడుపై నమోదు చేసిన కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారని జస్టిస్ అనిరుద్ధబోస్ అన్నారు. కేసుల నమోదుకు ముందు సీఐడీ తగిన అనుమతి తీసుకుని ఉండాల్సిందని, సెక్షన్ 17ఏ కింద ముందస్తు అనుమతులు తప్పనిసరి అని అలా లేకపోతే అది చట్ట విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
2018 చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు 17 ఏ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం. త్రివేది పేర్కొన్నారు. నిజాయతీ గల పబ్లిక్ సర్వెంట్స్‌కు ఇబ్బంది ఉండకూడదనే సెక్షన్ 17 ఏ చట్టసవరణ తెచ్చారని తెలిపారు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాల వ్యక్తం చేయడంతో సీజేఐకి నివేదిస్తున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.