TDP Leaders on Chit Funds: చిట్ ఫండ్ కంపెనీలపై కేసులు పెడుతున్న సీఐడీ.. ఆర్థిక శాఖలో నిధుల తరలింపును ఎందుకు పట్టించుకోవట్లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము తరలించిన ఆర్థికశాఖ అధికారులపై సీఐడీ ఎప్పుడు కేసు పెడుతుందని ప్రశ్నించారు. చిట్ ఫండ్ కంపెనీలు ఖాతాదారుల సొమ్ములు తరలించాయనే అనుమానంతో, ఫిర్యాదులు లేకున్నా సీఐడీ కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తోందని మండిపడ్డారు.
"చిట్ ఫండ్ కంపెనీలు ఖాతాదారుల సొమ్ములు తరలించాయని తమకున్న అనుమానంతో.. ఫిర్యాదులు లేకున్నా రాష్ట్రంలో CID కేసులు పెట్టి, అరెస్ట్‌లు చేస్తోంది. మరి ఉద్యోగుల GPF సొమ్ము రూ. 486 కోట్లు వారికి తెలియకుండా వారి ఖాతాల నుంచి మాయం చేశారని ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపిస్తున్నారు. ఇది నేరం కాదా? ఉద్యోగుల GPF సొమ్ము తరలించిన ఆర్థికశాఖ అధికారులపై CID ఎప్పుడు కేసు పెడుతుంది?"-ట్విట్టర్లో ధూళిపాళ్ల నరేంద్ర
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము 486 కోట్ల రూపాయలను వారికి తెలియకుండా వారి ఖాతాల నుంచి మాయం చేశారని ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపిస్తున్నారుగా.. మరి దానిని నేరంగా ఎందుకు పరిగణించట్లేదని నిలదీశారు. చిట్ ఫండ్ కంపెనీల విషయంలో అనుమానంపైనే కేసులు పెట్టిన సీఐడీ, ఉద్యోగుల సొమ్ము మాయం అయినట్లు నిర్ధారణ అయినా ఎందుకు కేసులు పెట్టడం లేదో సమాధానం చెప్పాలని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు.
జగన్ తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం పార్టీ భయపడదు: చిట్ ఫండ్ కంపెనీలు నిర్వహించడం జగన్ రెడ్డి దృష్టిలో నేరమా అని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వాళ్లేమీ జగన్మోహన్ రెడ్డిలా సూట్ కేసు కంపెనీలు పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకోవట్లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయ్‌ని గొడ్డలి వేటుకు బలి చేయలేదా అని ఎద్దేవా చేశారు. ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యుల అక్రమ అరెస్ట్ పిరికిపంద చర్య అని యనమల ధ్వజమెత్తారు. బీసీలు వ్యాపారాలు చేసుకోకూడదా అని నిలదీశారు.
మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ ఓటు వేయకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారని మండిపడ్డారు. అది విఫలం కావడంతోనే కక్ష పెట్టుకున్నారని విమర్శించారు. రాజమండ్రిలో జరగనున్న మహానాడు నిర్వహణలో ఆదిరెడ్డి కుటుంబం చురుగ్గా పాల్గొనకూడదని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం పార్టీ భయపడదని యనమల స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం ఆగదని తెలిపారు. అక్రమ కేసులు, అరెస్ట్‌లకు భయపడి ప్రజా సమస్యలపై వెనక్కు తగ్గమని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: