Yuvagalam Padayatra Completed 1000 KM : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వెయ్యి కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో కేక్ కట్ చేసి.. బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసిన నారా లోకేశ్‌కు పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. జగన్ అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి మరీ చంద్రబాబుకు అప్పగిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలే చెబుతున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.
మళ్లీ బాబు రావాలి... బాగు పడాలి : గతంలో లోకేశ్‌ను విమర్శించిన వారికి ఇప్పుడు అతను నిప్పులా కనబడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ వెల్లడించారు. మళ్లీ బాబు రావాలి... బాగు పడాలి...అని ప్రజలంతా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ కేడర్ అడ్డుకున్నా, పోలీసులు ఇబ్బందులు తలపెట్టినా, లోకేశ్ 1000 కిలో మీటర్లు పూర్తి చేయడం మామూలు విషయం కాదన్నారు.
మారుబోతున్న రాజకీయ ముఖచిత్రం : పాదయాత్రలో స్టూళ్లు.. డీజే సౌండ్ సిస్టంలను కూడా పోలీసులు ఎత్తుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. లోకేశ్ పాదయాత్రకు జగన్ భయపడుతున్నారని స్పష్టం చేశారు. లోకేశ్ పాదయాత్రతో రాజకీయ ముఖ చిత్రం మారుతోందని నేతలు పేర్కొన్నారు. యువగళం అనే పేరుకు తగ్గట్టే పాదయాత్రలో యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, లోకేష్ పాదయాత్ర కోసం ప్రతి నియోజకవర్గంలో ఎదురు చూస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు.
" నారా లోకేశ్ ఎక్కడికి వెళ్లిన ఊర్లు ఊర్లు కలిసి వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు ఆయన వెనుక నడుస్తున్నారు. మళ్లీ బాబు రావాలి..బాగు పడాలనే నినాదంతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ వెయ్యి కిలో మీటర్లే కాదు సంకల్పించినటువంటి 4 వేల కిలో మీటర్లు తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా పూర్తి చేస్తారు. ఈ పాదయాత్రతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. " - బోండా ఉమ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
" అన్ని వర్గాల ప్రజలతో కలిసి మమేకమై పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్ర జరుగుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. లోకేశ్ బాబు మాట్లాడే ప్రతి మాట, చేసిన అభివృద్ధిని సెల్ఫీ తీసి చూపిస్తున్నారు. వైసీపీ నాయకుల అవినీతిని బట్టలు ఊడదీసీ రోడ్డు మీద పెట్టి అడగుతుంటే ఎవ్వరి దగ్గర సమాధానాలు లేవు. జగన్ మోహన్ రెడ్డి బయపడుతున్నారు. " - దేవినేని ఉమ, టీడీపీ నేత
విశాఖ టీడీపీ కార్యాలయంలో సంబరాలు : విశాఖ టీడీపీ కార్యాలయంలో నారా లోకేశ్ పాదయాత్ర వెయ్యి రోజులు పూర్తైనందుకు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, పల్లా శ్రీనివాసరావులు కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ నారా లోకేశ్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. మండుటెండలో ఎక్కడికి వెళ్లిన ప్రజా స్పందన వెళ్లివిరుస్తోందని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఈ వైఎస్సార్సీపీ పాలనకు గుణపాఠం చెప్పిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని క్యాలెండర్ విడుదల చేసి చూపించారు. లోకేశ్ పాదయాత్రకు ఈ రోజు వరకు విరామం లేదని, ఒక్క తారకరత్న మరణ సమయంలో కొద్దీ రోజులు విరామం వచ్చిందని మిగిలిన సమయంలో ప్రజాల్లోనే ఉన్నారని చెప్పారు. కానీ జగన్ పాదయాత్ర రిలే పాదయాత్ర అన్నారు. గురువారం సాయంత్రం వెళ్లిపోయి శుక్రవారం కోర్ట్‌కి హాజరయ్యి వచ్చి పాదయాత్ర చేశారని గంటా శ్రీనివాసరావు విమర్శించారు.
టీడీపీ నేత బండారు సత్య నారాయణ మూర్తి మాట్లాడుతూ.. చిన్న వయస్సులో 4 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌కు భగవంతుల ఆశీస్సులు ఉండాలని అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో భాగంగా చేస్తున్న సెల్ఫీ ఛాలెంజ్‌కి సమాధానం లేదని అన్నారు. లోకేశ్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు తమకు పవిత్ర గ్రంధాలతో సమానమని బండారు సత్య నారాయణ మూర్తి అన్నారు.
ఇవీ చదవండి