ఒక ఉన్మాది చేతిలో అమరావతి బలైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ... ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకుండా మౌనంగా ఉండటం సరికాదని గుంటూరులో అన్నారు. ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు.
వడ్డీతో సహా చెల్లిస్తాం...
గుంటూరు కార్పొరేషన్లో వైకాపా గెలిస్తే అమరావతి నుంచి రాజధానిని మార్చేందుకు స్థానికులు అనుమతి ఇచ్చినట్లేనని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. కేసులకు భయపడొద్దని, రామతీర్థం వెళ్తే తనపైనా కేసు నమోదు చేశారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు.
ఓటర్లు సత్తా చాటాలి...
రాష్ట్రంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా నిత్యావసర ధరలు పెరిగాయని, దీనికితోడు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని ఆరోపించారు. వాలంటీర్లను చూసి ప్రజలు భయపడాల్సిన పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్... నేడు పిడిగుద్దులు గుద్దుతున్నారన్నారు. సొంత బాబాయి హత్య, కోడికత్తి కేసు, పింక్ డైమండ్ వ్యవహారంలో జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. మార్చి 10న జరిగే ఎన్నికల్లో ఓటర్లు తమ సత్తా చూపించాలని కోరారు.
ఇదీచదవండి.