రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి సరైన పాలన లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. గుంటూరులో మాట్లాడిన ఆయన... రాష్టానికి ఒకే రాజధాని అమరావతి ఉండాలని గతంలో అంగీకరించిన జగన్..అధికారంలోకి రాగానే మాట తప్పి మడమ తిప్పారన్నారు. ప్రజల ఆమోదం, రైతుల త్యాగంతో ఏర్పడిన రాజధానిని కూల్చడానికి వైకాపా ప్రయత్నిస్తుందని విమర్శించారు. గత 298 రోజులుగా అమరావతి రైతులు అలుపెరుగని పోరాటం చేస్తుంటే.. వైకాపా నేతలు రైతులు, మహిళలను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.
పోలీసు జులుం ఉపయోగించి అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విశాఖలో వైకాపా నేతలు ఆస్తులు కొన్నారు కాబట్టే, రాజధానిని విశాఖ తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. పేదవారి పొట్ట కొట్టిన ఏకైక ప్రభుత్వం వైకాపాదే అని విమర్శించారు.
ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా భారీ అవినీతికి తెరతీసింది. కరోనాని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారు. రాష్టంలో అక్రమ మద్యం ఏరులై పారడానికి కారణం వైకాపా ప్రభుత్వమే. వైకాపా నేతలు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను, న్యాయవ్యవస్థలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్ర డీజీపీ మూడు సార్లు కోర్టు ముందుకు రావడం ఎంత సిగ్గు చేటో ఆలోచించుకోవాలి. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు పోరాటం ఆగదు. రాజధాని కోసం పోరాడే ప్రతి ఒక్కరు చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోతారు.--- ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి
ఇదీ చదవండి : ఆర్ఎస్ఎస్ సమావేశాలు...ఆలయాల దాడులపై చర్చ!