TDP Kanthi Tho Kranthi Program: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం చేపట్టిన `కాంతితో క్రాంతి` కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాల్లో హోరెత్తింది. ఆమదాలవలసలో కొవ్వొత్తులు, టార్చిలైట్లు వెలుగుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులు కాగడాలతో ప్రదర్శన చేశారు. టెక్కలిలో టీడీపీ కార్యాలయం వద్ద మహిళలు నినాదాలు చేశారు. పలాసలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. లావేరు మండలంలో మాజీ మంత్రి కళా వెంకటరావు కాగడాల ర్యాలీలో పాల్గొన్నారు.
విజయనగరంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. శృంగవరపుకోటలో ఏపీ విత్ సీబీఎన్ అనే నినాదంతో ప్రమిదలు ఏర్పాటు చేశారు. బొబ్బిలి కోటలో కొవ్వొత్తులు వెలిగించారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని ఇంట్లో విద్యుత్ దీపాలు ఆర్పి నిరసన తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. సాలూరులో స్థానిక నేతలు మోకాళ్ళపై కూర్చొని కొవ్వొత్తులు వెలిగించారు.
విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సెల్ ఫోన్ లైట్లతో వందలాది మంది నిరసన తెలిపారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన నివాసంలో కొవ్వొత్తులు వెలిగించారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు కాంతితో క్రాంతి నిర్వహించారు. పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పాడేరు, అరకు, రంపచోడవరంలో కాగడాల ప్రదర్శన చేశారు. అనకాపల్లిలోనూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. నర్సీపట్నంలో తెలుగు యువత స్కై లాంపులు వెలిగించారు.
తూర్పుగోదావరి జిల్లా వేలివెన్నులో కొవ్వొత్తులు, కాగడాలు, సెల్‌ఫోన్ లైట్లతో భారీ ప్రదర్శన చేశారు. అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు కొవ్వొత్తులతో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఏలూరులో బడేటి చంటి ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలు ఆర్పి నిరసన తెలిపారు.
రాజధాని రైతులు మందడంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. తుళ్లూరులో తెలుగుదేశం పార్టీ నేతలు మానవహారం నిర్వహించారు. ద్విచక్రవాహనాల లైట్లను బ్లింక్ చేస్తూ నిరసన తెలిపారు. కృష్ణాయపాలెంలో రైతులు కాగడాల ర్యాలీ చేశారు. వెంకటపాలెంలో మహిళలు కొవ్వొత్తులు వెలిగించారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో
తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రమిదలు వెలిగించారు. మాజీమంత్రి కన్నా లక్ష్మినారాయణ తన నివాసంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. తెనాలిలో ఆలపాటి, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, పొన్నూరు లో ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తులు, సెల్ ఫోన్ లైట్లతో నిరసన ర్యాలీ చేశారు. నరసరావుపేట లోఎన్టీఆర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించారు.
ప్రకాశం జిల్లా కొండపి, సింగరాయకొండలో ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి నిర్వహించారు. మార్కాపురంలోకొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ చేశారు. యర్రగొండపాలెం, పొదిలి, కొనకనమిట్లలో బాబుతో మేమంటూ నినదించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిరసన ప్రదర్శన జరిగింది. అద్దంకి లైట్లు ఆపి ..దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. నెల్లూరు లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాంతితో క్రాంతిలో పాల్గొన్నారు. ఆత్మకూరులో కొవ్వొత్తులతో మహిళలు ర్యాలీ చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నేతలు ర్యాలీలు చేశారు. అనంతపురంలో కాగడాలు వెలిగించి నిరసన తెలిపారు. టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్ ఇళ్లలో లైట్లు ఆర్పి నిరసన తెలిపారు. హిందూపురంలో మహిళలు , చిన్నారులు విద్యుత్ దీపాలు ఆపి నిరసనలో పాల్గొన్నారు. పెనుకొండలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కర్నూలులో పార్టీ కార్యాలయంలో కొవ్వొత్తులు వెలిగించారు. కౌతాళంలో కాగడాల ప్రదర్శన చేశారు. ఎమ్మిగనూరులోకొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. నంద్యాలలోకాగడాలతో ర్యాలీ చేశారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో సెల్ ఫోన్ల లైట్లతో బాబుకు మద్దతు ప్రకటించారు. కడపలో ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు.
పులివెందులలో బీటెక్ రవి కొవ్వొత్తి వెలిగించి నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో తారాజువ్వలతో మద్దతు పలికారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమరనాథరెడ్డి కొవ్వొత్తులు వెలిగించారు. తిరుపతిలో మహిళలు కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. నగరిలో మహిళలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.