TDP Agitations All Over AP Against CBN Arrest: చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. బాబు కోసం మేము సైతం అంటూ రిలే నిరాహార దీక్షలు, కాగడాల ర్యాలీలు, జల దీక్షలు చేపట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించిన చంద్రబాబును అరెస్టు చేయడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తెలుగుదేశం నాయకులు దీక్ష చేపట్టారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా చందర్లపాడులో నిర్వహించిన కాగడాల ర్యాలీలో "బాబు కోసం మేము సైతం" అంటూ నినదాలతో తమ నిరసన గళాన్ని వినిపించారు. ర్యాలీ తర్వాత అలివేలమ్మ ఆలయంలో టెంకాయలు కొట్టారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో తెలుగు మహిళలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ నేత కొండయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. అద్దంకి తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో "చంద్రన్న ఎలా ఉన్నావు" అంటూ రాజమండ్రి సెంట్రల్ జైలు అడ్రస్‌తో పోస్ట్ కార్డులు పంపారు. కొరిశపాడు మండలం సోమవారప్పాడులో కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని బొడ్డురాయి వద్ద కొబ్బరికాయలు కొట్టారు.
విశాఖ జిల్లా ఎండాడలో తెలుగుదేశం, జనసేన నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ తర్వాత అమ్మవారి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సంతకాల సేకరించారు. అక్రమ అరెస్టులు ఆపాలంటూ కోనసీమ జిల్లా రావులపాలెంలో బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కరపత్రాలు పంచారు. చంద్రబాబు అరెస్టుపై ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారి గూడెంలో నల్లబెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలో కాగడాల ర్యాలీ చేశారు. కే ఎస్ జవహార్ ఆధ్వర్యంలో కొవ్వూరు మండలం దారవరం నుంచి నిడదవోలు కోటసత్తమ్మ ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ అమ్మవారికి పూజలు చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో టీడీపీ శ్రేణులు పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఈ పాదయాత్రకు జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు క్షేమం కోసం యర్రవరం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆర్టీసీ బస్సులను శుభ్రం చేస్తూ తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు. జగన్ ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు చర్యలతో ప్రజాస్వామ్యం పరిహాసమవుతోందని మండిపడ్డారు. తణుకు దీక్షలో పాల్గొన్న నాయకులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నంద్యాల టీడీపీ నేతలు దీక్షకు పూనుకున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్లలోని గాజులదిన్నె ప్రాజెక్టులో నాయకులు జలదీక్ష చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన చంద్రబాబు వీరాభిమాని సతీశ్.. కదిరి నియోజకవర్గం నుంచి రాజమండ్రికి సైకిల్ యాత్ర చేపట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో తెలుగుదేశం నాయకులు నీటిలో దిగి నిరసన వ్యక్తంచేశారు.
రాబోయే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్పుతారని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో ఫ్యాక్టరీలు, దుకాణాలు, మార్కెట్ యార్డులో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆధ్వర్యాన కరపత్రాలను పంచారు. చంద్రబాబును విడుదల చేసే వరకు ఉద్ధృతంగా ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు.