NEW RULE FOR YSR PENSION : వైఎస్సార్ పింఛను కానుక కింద సామాజిక భద్రత పింఛన్లు అందుకుంటున్న పింఛనుదారులపై.. వైసీపీ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఇప్పటికే పోర్టబులిటీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం.. ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను పెట్టింది. తాజాగా ఈ నెల నుంచే జియో ఫెన్సింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో ఇక నుంచి ఎవరైనా లబ్ధిదారుడికి.. తన నివాస ధ్రువీకరణ పత్రాలున్న సచివాలయ ప్రాంతం నుంచి 15 కిలోమీటర్ల లోపు మాత్రమే వాలంటీర్లు పింఛను అందించే సదుపాయం ఉంటుంది. 15 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే పింఛను మొత్తాన్ని అందించే అవకాశం వాలంటీరుకు ఉండదు. అలాంటి వారికి పింఛను ఇవ్వాల్సి వస్తే.. జిల్లా డీఆర్‌డీఏ అధికారులను సంప్రదించాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 63.42 లక్షల మందికి ప్రభుత్వం ఏప్రిల్ నెలకుగాను పింఛన్లు అందిస్తోంది. వీరిలో కొందరు.. పింఛను తీసుకునే సమయానికి వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స తీసుకుంటుంటారు. మరికొందరు.. దూరప్రాంతాలకు వెళ్లి సకాలంలో అందుబాటులో ఉండలేని పరిస్థితి ఉంటోంది. దూర ప్రాంతాల్లోని పిల్లల దగ్గర కొంతమంది వృద్ధులు ఉంటున్నారు. వైద్య చికిత్స కోసం తాత్కాలికంగా వారి వద్దకు వెళ్లిన వారూ ఉన్నారు. ఇలాంటి వారి దగ్గరకు వాలంటీర్లు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. 15 కిలోమీటర్లు దాటితే ఇప్పుడా పరిస్థితి ఉండదు. పైగా కనీస సమయం ఇవ్వకుండా సోమవారం నుంచే ఈ ఆదేశాలను అధికారులు అమల్లోకి తెచ్చారు. దీంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు, దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో కొన్ని చోట్ల సిగ్నల్ సమస్య ఉంటుంది. అలాంటి వారికి కొంత దూరం వెళ్లి పింఛను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది.
నివాస ధ్రువీకరణ పత్రాలు, ఒక గ్రామంలో ఉండి.. ఇతర అవసరాల రీత్యా వేరే గ్రామాలు లేదా పట్టణాల్లో ఉంటున్న లబ్ధిదారులు.. పోర్టబులిటీ విధానంలో అక్కడే పింఛను తీసుకునే వెసులుబాటు గతంలో ఉండేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మొదటి రెండేళ్లు ఈ విధానాన్ని కొనసాగించింది. ఆ తర్వాత రద్దు చేసింది. ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలనే నిబంధన తీసుకొచ్చింది. ఈ సౌకర్యాలు తొలగించడంతో ఇప్పటికే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా తీసుకొచ్చిన జియో ఫెన్సింగ్ విధానం లబ్ధిదారులను మరిన్ని ఇక్కట్లకు గురి చేయనుంది.
ఇవీ చదవండి: