Land Registration Charges Hike: రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువల్ని పెంచడంపై సామాన్య, మధ్య తరగతి వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మోయలేని భారం పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం భూమి విలువను పెంచడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఖజానా నింపుకోవడానికి ఇప్పటికే అన్ని రకాల పన్నులు పెంచిన ప్రభుత్వం.. శాస్త్రీయ విధానాన్ని పాటించక భూముల రిజిస్ట్రేషన్ల ఛార్జీలను పెంచడం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కనున్న భూముల విలువను 40నుంచి 60శాతం వరకు పెంచారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం పరిసరాలైన పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని గ్రామాల్లో గజం 4 వేల నుంచి 5 వేలు రూపాయలు పెంచారు. పార్వతీపురం సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల విలువ 30 శాతం మేరకు పెంచినట్లు స్థానికులు తెలిపారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో 10 నుంచి 15 శాతం, విజయనగరం పశ్చిమ రిజిస్టర్ కార్యాలయం పరిధిలోని 18 గ్రామాల్లో 20 శాతం వరకు భూమి విలువ పెంచారు. భూముల మార్కెట్ విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువ ఉండటం వల్ల సామాన్యుల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
No Land Registrations: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్ సేవలు.. ప్రజల పడిగాపులు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 27 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని వివిధ చోట్ల 20 శాతం మేరకు భూముల ధరలు పెంచారు. ఏలూరు టూటౌన్ ఆర్ఆర్ పేట వాణిజ్య ప్రాంతంలో 60 వేలు ఉన్నగజం ధర ప్రస్తుతం 65వేలకు చేరింది. అగ్రహారంలో 18వేలు ఉన్న ధర... 28వేల రూపాయలకు చేరడంతో 10 వేలు అదనపు భారం పడుతోందని స్థానికులు వాపోతున్నారు.
చింతలపూడిలో ఎకరం ధర9 లక్షల రూపాయల నుంచి 12 లక్షలకు పెరగడంతో 3 లక్షల వరకు భారం పడుతోందంటున్నారు. ఛార్జీల పెంపు మధ్యతరగతి వర్గాల వారిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత ప్రాంతాల్లోనే రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపుదల జరిగిందని, మిగిలిన చోట్ల సాధారణ ధరలే అమలులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. క్రయవిక్రయాల మీద పెద్దగా ప్రభావం ఉండదని అభిప్రాయపడుతున్నారు.
Registration Problems: సర్వర్ సమస్య.. కిక్కిరిసిన రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు
"ఒక పేదవాడు.. ఎక్కడైనా చిన్న భూమి చూసి దానిని రిజిస్ట్రేషన్ చేపించుకుందాం అనుకుంటే ప్రస్తుతం పెరిగిన ఛార్జీల కారణంగా.. ఆ డబ్బుల కోసం మరో రెండు, మూడు నెలలు ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. పేదవారికి, రైతులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గిస్తే బాగుంటుంది అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం". - స్థానికుడు