Special Security Group to CM Jagan Mohan Reddy: ప్రపంచంలో ఏ నియంత అయినా సరే ప్రతిక్షణమూ అభద్రత, మితిమీరిన భయంతో బతుకుతుంటారు.. వారు నీడను సైతం నమ్మరు. తమ అరాచకాలు, అణచివేత, అకృత్యాలు, హింసాత్మక చర్యల కారణంగా శత్రువులుగా మారినవారి వలన ఎప్పుడు ఎటువైపు నుంచి ముప్పు ఉంటుందోనన్న విపరీతమైన భయాందోళనలతో చీమ కూడా చొరబడలేనంతగా భద్రతను ఏర్పాటు చేసుకుంటారు.
రాష్ట్రంలో పౌర హక్కుల్ని కాలరాస్తూ, అణచివేత, అరాచకాలు, ప్రతీకారం, రాజకీయ కక్ష సాధింపులకు తన పాలనను వేదికగా మార్చేసిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. ఆ తరహాలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కోసం ఏకంగా చట్టమే తీసుకొచ్చారు. తనకు, తన భార్య, పిల్లలు, తల్లికి దేశ, విదేశాల్లో సైతం అత్యంత సమీపం నుంచి భద్రత (Proximate Security) కల్పించడానికి స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుని (Special Security Group) ఏర్పాటు చేస్తూ ప్రత్యేక చట్టమే చేశారు.
Z Plus Security: సీఎం జగన్కు ఉగ్రముప్పు.. జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: ఏపీ ఇంటెలిజెన్స్
ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి కుమార్తెలు ఇద్దరూ విదేశాల్లోనే ఉన్నారు. ఎస్‌ఎస్‌జీ చట్టం ప్రకారం వారికి అక్కడ కూడా భద్రత కల్పిస్తారు. దేశంలో తొలిసారిగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ లేని విధంగా ఏపీ సీఎం, ఆయన కుటుంబ భద్రత కోసం ఇలా ప్రత్యేకంగా ఎస్‌ఎస్‌జీని ఏర్పాటు చేస్తున్నారు.
మావోయిస్టుల సమస్య తీవ్రంగా ఎదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ఇలాంటి భద్రత లేదు. ప్రధానమంత్రి భద్రత కోసం ప్రత్యేకంగా ఎస్‌పీజీ (Special Protection Group) ఉంది. అదే స్థాయిలో ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబసభ్యుల భద్రత కోసం ఎస్‌ఎస్‌జీని సిద్ధం చేస్తున్నారు. గవర్నర్ ఆమోదం లభిస్తే, గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎస్‌ఎస్‌జీ చట్టం అమల్లోకి రానుంది.
ముఖ్యమంత్రి జగన్కు భద్రత పెంపు
సీఎం భద్రతలో ఎక్కడా రాజీపడాల్సిన అవసరమే లేదు. సీఎం సెక్యూరిటీ గ్రూపు (సీఎంఎస్‌జీ), ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (Intelligence Security Wing)ల్లో వందల మంది ఆరితేరిన సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఏకంగా ఎస్‌ఎస్‌జీని ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా చట్టం తీసుకురావడం నిజంగా భద్రత కోసమా లేదంటే భయమా? అనే సందేహాలను రేకెత్తిస్తోంది.
ఎక్కడున్నా నిరంతర భద్రత: సీఎం, అతని భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు ఇంట్లోనూ, ప్రయాణ సమయంలోనూ, ఎక్కడైనా బస చేసినప్పుడు, వేరే ప్రదేశానికి వెళ్లినప్పుడు ఇలా అన్ని సందర్భాల్లోనూ ఎస్‌ఎస్‌జీ నిరంతరం రక్షణ కల్పిస్తుంది. దేశ, విదేశాల్లోనూ ఈ మేరకు అవసరమైన భద్రతపరమైన సేవలు అందించేందుకు ఎస్‌ఎస్‌జీలోని సభ్యులు సిద్ధంగా ఉండాలని చట్టం చేశారు. సీఎం భద్రతా విభాగంలో పనిచేయడానికి గతంలో మంజూరైన 431 పోస్టులను మొత్తంగా ఎస్‌ఎస్‌జీకే కేటాయించారు. అంతే కాకుండా ఎస్‌ఎస్‌జీలో పనిచేయటానికి పోలీసు శాఖలోని వివిధ విభాగాల నుంచి సైతం డెప్యుటేషన్ ప్రాతిపదికన సిబ్బందిని తీసుకోనున్నారు.