తనయుడే తండ్రి పాలిట యముడయ్యాడు. ఆపై ఓ కట్టుకథ అల్లి రహస్యంగా మృతదేహాన్ని అంత్యక్రియలు చేయించాలని పథకం రచించాడు. రుద్ర ఛారిటబుల్ ట్రస్టు సభ్యుల అప్రమత్తతతో మిస్టరీ బయటపడింది. గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన పిల్లలమర్రి శివానందరామం అలియాస్ ఆనందరావు (72) పౌరోహిత్యం చేసుకుంటూ జీవిస్తున్నారు. భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది. వీరికి వంశీమోహన్, కిషోర్ కుమారులు. చిన్న కుమారుడు కిషోర్ కొంతకాలం క్రితం మృతి చెందాడు. వంశీమోహన్ వివాహం చేసుకొని వేరేగా ఉంటున్నాడు. కొంతకాలంగా తండ్రి, కుమారుడికి మధ్య మనస్పర్థలు రావడంతో ఆనందరావు ఒక్కరే విడిగా ఉంటున్నారు.
మంగళవారం అర్ధరాత్రి నల్లపాడురోడ్డులోని శ్మశానవాటికకు ఓ ఆటోలో వృద్ధుడి మృతదేహం తీసుకొచ్చారు. అక్కడి కాటికాపరికి తాము అద్దె ఇంట్లో ఉంటున్నామని, తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. రాత్రివేళ అంత్యక్రియలు చేయకూడదని కాటికాపరి తెలపడంతో మీరే ఆదుకోవాలని రోదిస్తూ..రేపు ఉదయం వస్తాం..అప్పటివరకు భద్రపరచాలంటూ వదిలిపెట్టి వెళ్లారు. దీంతో కాటికాపరి అనాథ శవాలను ఖననం చేయడానికి సాయపడే రుద్ర ఛారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు సుభానీకి ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే సుభానీ ఫ్రీజర్‌తో పాటు తన వద్ద ఉన్న అంబులెన్స్‌ను పంపించి అందులో ఉంచితే ఉదయం వచ్చి పరిశీలిస్తామన్నారు.
హత్య మిస్టరీ బయటపెట్టిన గాయం
బుధవారం ఉదయం సుభానీ, సంస్థ సభ్యులతో కలిసి శ్మశానవాటికకు వెళ్లారు. మృతదేహానికి సంబంధించిన వారికి కాటికాపరి ఫోన్ చేస్తుంటే ఎవ్వరూ తీయడం లేదు. మృతదేహం ఇచ్చే సమయంలో తన భార్య కడుపుతో ఉన్నదని, కర్మకాండలు చేయకూడదని చెప్పాడని కాటికాపరి తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన సుభానీ మృతదేహాన్ని కప్పి ఉంచిన వస్త్రం కొంచెం పైకి తీసి చూడగా కాలికి తీవ్ర గాయమై ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మహిళ విషయంలో వివాదం!
నగరంపాలెం సీఐ రత్నస్వామి మృతదేహంపై కప్పిన వస్త్రం తొలగించి చూస్తే వృద్ధుడి శరీరం మొత్తం తీవ్రమైన గాయాలు ఉండటంతో హత్యగా భావించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వంశీమోహన్‌కు మరో మహిళతో పరిచయం ఉన్నదని, ఈ క్రమంలో ఆమె వలన తన కుమారుడి కాపురం పాడవుతుందని భావించిన ఆనందరావు.. ఆ మహిళకు ఇది మంచి పద్ధతి కాదని నచ్చజెప్పినట్లు సమాచారం. తన సహచరిని ఎందుకు దూరం చేశావు? అంటూ వంశీ తండ్రితో గొడవ పెట్టుకొని కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆనందరావును ఆటోలో అరండల్‌పేటలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తేలడంతో అటు నుంచి అటు మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాడు. కుమారుడు ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో అనందరావు మృతి చెంది ఉంటాడని సీఐ రత్నస్వామి అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి