Cruel Son: నవమాసాలు మోసి, కంటికి రెప్పలా పెంచిన కన్నతల్లిపైనే అమానుషంగా దాడి చేశాడో ఓ కొడుకు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన శేషు.. వృద్ధాప్యంలో అమ్మ ఆలనాపాలనా చూసుకోవాల్సింది పోయి.. చిత్ర హింసలకు గురి చేశాడు. తల్లి పేరిట ఉన్న ఆస్తిని రాసివ్వాలంటూ.. భార్యతో కలిసి నిత్యం నరకం చూపించాడు. దెబ్బలకు తాళలేక విలపిస్తున్న తల్లిపై ఏ మాత్రం కనికరం చూపక.. కర్రతో చితక బాదాడు. స్థానికులు ఈ దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కర్కశ కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
పరామర్శించిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురంలో కన్నకొడుకు చేతిలో చిత్రహింసలకు గురైన తల్లిని.. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధితురాలు నాగమణిని ఆదుకుంటామని పద్మ భరోసా ఇచ్చారు. నాగమణి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిత్రహింసలకు గురిచేసినప్పటికీ కుమారుడిపై కేసు పెట్టొద్దని నాగమణి కోరారు.
ఈ ఒక్కసారి క్షమించి వదిలేయాలని వాసిరెడ్డి పద్మకు విన్నవించారు. ఆమె విజ్ఞప్తి మేరకు ప్రస్తుతానికి వదిలేస్తున్నామని.. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని పద్మ హెచ్చరించారు. కుమారుడు ఆదరించకపోతే ప్రభుత్వం తరఫున నాగమణి సంరక్షణ బాధ్యతను.. తామే తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
మద్యం తరలిస్తూ పోలీసులపైకి దూసుకెళ్లిన కారు.. సీసీ టీవీలో నమోదైన ప్రమాద దృశ్యాలు