భాజపా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దేవాలయాల సందర్శనంలో భాగంగా.. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని భాజపా(bjp) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) దర్శించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగుపడాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పిన ఆయన. ఆమేరకు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేలా ముఖ్యమంత్రి జగన్కు జ్ఞానోదయం కల్గించాలని అమ్మవారిని కోరినట్లు సోము వీర్రాజు తెలిపారు. ఆలయాల విధ్వంసానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
అంతకుముందు గుంటూరు జిల్లా తాళ్లాయిపాలెం భాజపా ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 27 వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెంటనే మొత్తం కౌలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతాన్ని ప్రభుత్వమే సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నారు. రాజధాని ప్రాంతంలో మౌళిక సదుపాయాలను మెరుగుపరిస్తే.. భూములు పొందిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యక్రమాలను ఇక్కడ ప్రారంభించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
తుళ్లూరులోని శైవ క్షేత్రంలో ప్రత్యేక పూజలు
గురు పౌర్ణమిని పురస్కరించుకొని సోము వీర్రాజు.. గుంటూరు జిల్లా తుళ్లూరులోని శైవ క్షేత్రంలో ఆది దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్షేత్ర పీఠాధిపతి శివ స్వామిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి పాల్గొన్నారు.
కోటప్పకొండ ఆలయ దర్శనలో..
చర్చిలు కట్టడం, ప్లాస్టర్లకు జీతాలు ఇవ్వటమే ప్రధాన అజెండాగా వైకాపా ప్రభుత్వం ముందుకు వెళ్తుతుందని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. దేవాలయాల సందర్శనలో భాగంగా.. కోటప్పకొండ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయాల విధ్వంసానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడని సోము వీర్రాజు ఆరోపించారు. ఆలయాల్లో అన్యమతస్థులు విధులు నిర్వహించటాన్ని తప్పు పట్టిన ఆయన.. వాళ్లను విధుల నుంచి తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
ఇదీ చదవండి:
TDP PROTEST: రోడ్డుకు మరమ్మతులు చేపట్టిన చింతమనేని.. అడ్డుకున్న పోలీసులు!
Gilakaladindi Fishing Harbor: పెండింగ్లోనే.. గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ!