ఆమె చిన్ననాటి నుంచే ఆకాశం వైపు ఆసక్తిగా చూసేవారు. అందులోని అంతుచిక్కని రహస్యాల గుట్టు విప్పాలని.. రోదసిలో విహరించాలని కలలు కనేవారు! అందుకే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- ‘నాసా’లో వ్యోమగామి కావాలనుకున్నారు. కానీ కంటిచూపు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆ అవకాశాన్ని కోల్పోయారు. అయితేనేం..? నిరాశ చెందలేదు. పట్టు విడవలేదు. ఫలితం.. రోదసిలోకి వెళ్లిన భారత సంతతి మూడో మహిళగా తాజాగా రికార్డు సృష్టించారు. ఆమే- శిరీష బండ్ల.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో శిరీష జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఆమె ఏరోనాటికల్-ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. శిరీష తొలుత నాసాలో వ్యోమగామి కావాలనుకున్నారు. కానీ అందుకు అవసరమైన స్థాయిలో కంటిచూపు ఆమెకు లేదని తేలింది. దీంతో తొలుత తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే ఓ ప్రొఫెసర్ ఆమెకు.. కమర్షియల్ స్పేస్ ఫ్లైట్‌ల రంగంలో అవకాశాల గురించి చెప్పారు. అది శిరీషను బాగా ఆకర్షించింది. ఆ రంగానికి చెందిన వర్జిన్ గెలాక్టిక్‌లో చేరారు. ప్రస్తుతం అందులో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఆమె ‘వీఎస్‌ఎస్ యూనిటీ-22’లో దూసుకెళ్లి.. తన అంతరిక్ష విహార కలను సాకారం చేసుకున్నారు.
భారత్ నుంచి నాలుగో వ్యోమగామి
తాజాగా యాత్ర విజయవంతమవడంతో.. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి మూడో మహిళగా శిరీష రికార్డుల్లోకి ఎక్కారు. మొత్తంగా చూస్తే భారత్ నుంచి రోదసిలోకి వెళ్లిన నాలుగో వ్యోమగామి ఈమె. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ కంటే ముందే (1984లో) భారత పౌరుడు రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి. Sirisha bandla: శిరీష రోదసీ కల నెరవేరిందిలా...