PAG fire on AP Govt Hospitals Management: కార్పొరేట్ అన్న పదం జోడించినంత మాత్రాన ఆసుపత్రులేమీ రాత్రికి రాత్రే బాగైపోవు. నాలుగేళ్లుగా సీఎం జగన్ మాటలతో కాలం గడిపేశారు తప్ప.. ధర్మాసుపత్రులను ఏనాడూ పట్టించుకోలేదు. రోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎన్నడూ గుర్తించలేదు. ప్రభుత్వాసుపత్రులకు మందులు, సర్జికల్ ఐటమ్స్, వైద్య పరికరాల కొనుగోలుపై.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానాన్ని అమలు చేయడం లేదు. అవసరాలకు తగ్గట్టుగా కాకుండా.. అడ్‌హాక్ విధానంలోనే కొనుగోలు చేస్తోంది. దీనివల్ల అవసరమైనవి అందుబాటులో లేక, రోగులతో ప్రైవేటుగా కొనిపిస్తున్నారు. అంతేకాదు.. వైద్య పరికరాల వినియోగానికి తగ్గ నైపుణ్యం ఉన్న సిబ్బంది కొరత ఎక్కువగానే ఉంది. నిధుల వినియోగంలోనూ జగన్ సర్కారు వైఫల్యం కనబడుతోందని ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ కుండబద్దలు కొట్టింది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు వ్యవహరించిందని తూర్పారబట్టింది.
ప్రభుత్వాస్పత్రుల్లో 2017-18 నుంచి 2021-22 వరకు పీఏజీ ఆడిట్ చేసింది. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు బోధనాసుపత్రుల్లో చెన్నూరు, ఇనముడుగు, కార్జాడ కొండాపురం, కుడేరు, నారప్పల, తుమ్మలకుంట, ఉర్లాం పీహెచ్‌సీలతోపాటు.. కదిరి, కావలి, సీతంపేట, కొత్తచెరువు, నాయుడుపేట, సోంపేట ఏరియా సీహెచ్‌సీలు; ఆత్మకూరు, హిందూపురం, టెక్కలి జిల్లా ఆసుపత్రుల్లో తనిఖీలు చేసింది. ఆడిట్‌లో అనేక లొసుగులను బయటపెట్టింది. మందులు, పరికరాల కొనుగోలుకు 2 వేల 41.90 కోట్ల రూపాయలు కేటాయిస్తే.. రూ.17వందల 16.33 కోట్ల మాత్రమే వినియోగించినట్లు తేల్చింది. అవసరమైన మందుల్లో 69.7 నుంచి 88 శాతం మధ్య మాత్రమే ఉన్నాయి. అలాగే సర్జికల్ వస్తువుల్లో 65 నుంచి 88.2 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లోనూ తగినన్ని మందులు లేవని నిర్ధారించింది.
వైద్యవిధాన పరిషత్, ప్రజారోగ్యశాఖ పరిధిలోని ఆసుపత్రుల బడ్జెట్లో 10శాతం సొమ్ముతో స్థానికంగా మందులు కొనుగోలు చేయొచ్చు. కానీ హెచ్ఓడీ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు రానందున నిధులివ్వలేదన్నది ఏపీఎమ్ఎస్ఐడీసీ సమాధానం. దీనివల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెండరులో పేర్కొన్నట్లు మందుల కాలపరిమితికి 6 నెలల ముందుగా తెలియజేస్తే పంపిణీదారుడు కొత్తవి ఇవ్వాలి. లేదంటే అందుకు సరిపడా మొత్తాన్ని బిల్లుల చెల్లింపు నుంచి మినహాయించాలి. మందుల నిల్వ కేంద్రాల్లో 6నెలల్లో కాలపరిమితి ముగియనున్న మందుల విలువ 2.14 కోట్లుగా ఉంది. అంటే.. మందుల పంపిణీదారుడికి లబ్ధి చేకూర్చేలా ఏపీఎమ్ఎస్ఐడీసీ తీరు ఉందని పీఏజీ వ్యాఖ్యానించింది.
వైద్య పరికరాల కొనుగోలు, అవసరాలు, సాంకేతిక సిబ్బంది, నిర్వహణను పరిశీలించేందుకు.. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నేతృత్వంలో 'స్టేట్ లెవల్ నీడ్స్ అసెస్మెంట్ కమిటీ' 6 నెలలకొకసారి సమీక్షించాలి. దాన్నుంచి ఇండెంట్లు రాలేదన్నది ఏపీఎమ్ఎస్ఐడీసీ సమాధానం. చాలా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతతో హైవాల్యూ ఎక్విర్‌మెంట్, ఎమ్మారై సహా కోట్ల విలువైన పరికరాలు మూలనపడ్డాయి. సీటీ స్కాన్, ఎమ్ఆర్ఐ యంత్రాలను పీపీపీ విధానంలో కాకుండా నేరుగా కొన్నారు. మూడేళ్లపాటు రేట్ కాంట్రాక్ట్ అందుబాటులో ఉండగానే.. ఏటా సమీక్షించి కొనకుండా టెండరు పిలవడంపై పీఏజీ ఆక్షేపించింది. ఇతర పరికరాలనూ టెండర్ ద్వారా కొంటున్నారని మండిపడింది.