Sarpanchs Association Meeting: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో సర్పంచ్ సంఘాల ప్రతినిధులంతా పాల్గొని.. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని.. పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్ అన్నారు. గ్రామస్థాయిలో ఉన్న అన్ని ప్రభుత్వ విభాగాలు పంచాయతీ పరిధిలో పాలన చేయాలని ఉన్నా.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సచివాలయాల ద్వారా ఇప్పుడు జరిగేది చట్ట వ్యతిరేకమైన పాలనన్నారు. ప్రభుత్వ జీవోల ద్వారా రాజ్యాంగేతర శక్తులను ప్రజల మీదకు వదులుతారా అని ప్రశ్నించారు. సర్పంచ్‌ల హక్కులు, బాధ్యతలు లాక్కోవడానికి వాలంటీర్లు ఎవరని ప్రశ్నించారు.
"పంచాయతీ రాజ్ చట్టంలో, రాజ్యాంగంలో.. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ గురించి ఉందా. మరి ఈ రెండుచోట్ల లేని రాజ్యాంగేతర శక్తులు ఎక్కడ నుంచి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సొంత సైన్యంలా తయారు చేసుకున్నారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు". - వైవిబి. రాజేంద్రప్రసాద్, పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు
ఉత్సవ విగ్రహాలుగా సర్పంచులు: ప్రభుత్వం.. సర్పంచ్లను ఉత్సవ విగ్రహలుగా మార్చి విధులు, నిధులను లాగేసుకుందని ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు సర్పంచ్లకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అన్యాయన్నారు. సర్పంచులు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్న అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సర్పంచ్‌లు చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దశలవారీగా పోరాటం చేస్తామని తెలిపారు.
కేంద్రం ఇస్తున్న నిధులు సర్పంచ్లకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అన్యాయమన్నారు. తమను నమ్మి ప్రజలు గెలిపించారని, ఇప్పుడు వారికి ఏం చేయలేని పరిస్థితిలో తాము ఉన్నామని వాపోయారు. 2018 నుంచి 2022 వరకు కేంద్రం.. పంచాయతీలకు ఇచ్చిన 8,660 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని.. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాదాపు రెండేళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని అవేదన వ్యక్తం చేశారు.
2022-23 సంవత్సరానికి గాను కేంద్రం ఇచ్చిన 689 కోట్ల రూపాయల ఆర్ధిక సంఘం నిధులలో రూ.336 కోట్లను విద్యుత్ బిల్లులు పేరిట రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఆ మిగిలిన రూ.353 కోట్ల నిధులను కూడా ఇంత వరకు సర్పంచ్‌ల పీఎఫ్ఎంఎస్ అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా తమకు విలువ లేకండా ప్రభుత్వం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వాలంటీర్ వ్యవస్థలను తప్పుబట్టడం లేదని.. వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తాము ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలిచినా వారి కష్టాలు తీర్చలేకపోతున్నామని చెప్పారు. మంచినీరు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి చిన్న చిన్న పనులు కూడా చేయించలేకుండా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం ఎందుకు తమపై వివక్ష చూపుతుందో అర్ధం కావడం లేదన్నారు.