Samara Sankranti Protest at Amaravati: "సమర సంక్రాంతి" కార్యక్రమంలో భాగంగా అమరావతి రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు.. పొంగళ్లు పెట్టారు. "సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్" అని బెలూన్లపై రాసి వాటిని గాల్లోకి ఎగురవేశారు. అమరావతిపై దుష్ప్రచారాలను నిరసిస్తూ గాలిపటాలు ఎగరవేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక పండగలూ రోడ్డుపైనే చేసుకోవాల్సి వస్తోందని రాజధాని రైతులు వాపోయారు.
రహదారిపైనే భోజనం..
అమరావతి సమర సంక్రాంతి నిరసనలో భాగంగా రైతులు మహిళలు దీక్షా శిబిరం వద్ద రోడ్డు పైన భోజనాలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పండగలన్నీ రోడ్డుమీద చేసుకునే దుస్థితికి కల్పించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత మూడో సంక్రాంతిని కూడా రోడ్డుమీదనే జరుపుతున్నామని.. జగన్ దిగిపోయే వరకూ తమ శుభకార్యాలను రహదారులపైనే జరుపుకుంటామని రైతులు స్పష్టం చేశారు.