Republic Day celebrations: సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 ఏళ్లు పూర్తైన సందర్భంగా రాజ్యాంగకర్తల్ని స్మరించుకుందామన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించి.. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా...విజయవాడ భాజపా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జెండా వందనం చేశారు.. రాష్ట్రంలో జిల్లాల వారిగా జాతీయ జెండాని ఎగరవేశారు.
విశాఖపట్నం: భీమునిపట్నం జోన్ కాపులుప్పాడ కు చెందిన ఓ యువకుడు జాతీయ జెండాలతో బైక్ పై వినూత్న ర్యాలీ నిర్వహించాడు కాపులుప్పాడ కు చెందిన దుంప శ్రీనివాస్ రెడ్డి గత 15 ఏళ్ల నుండి ఇదే తరహాలో జాతీయ జెండా విశిష్టతను గౌరవాన్ని చాటి చెబుతూ ర్యాలీ నిర్వహిస్తున్నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ భీమిలి బీచ్ లో ద్విచక్ర వాహనానికి జాతీయ జెండాలతో నింపి సెల్యూట్ చేస్తూ అందరిని ఆకర్షించాడు..
చిత్తూరు: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపంజాణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 1000 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపంజాణి మండలం ఎంపీపీ శ్రీ రెడ్డప్ప, మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి హేమలత, సర్పంచ్ అఖిల జాఫర్, ఎంపీటీసీ శ్రీనివాసులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణప్ప, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
అనకాపల్లి: రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ శివారు పెద్దగరువు గిరిజన గ్రామంలో గిరిజనులే స్వచ్ఛందంగా జాతీయ జెండా పతాకాన్ని ఆవిష్కరించారు. కనీస మౌలిక సదుపాయాలు లేని అనేక గిరిజన గ్రామాల్లో వేలాదిమంది ఆదివాసులు జీవనం సాగిస్తున్నప్పటికీ రహదారి, తాగునీరు, విద్య, వైద్యం... వంటి కనీస మౌలిక సదుపాయాలకు దూరమవుతున్నామని ఇప్పటికైనా పాలకులలో పరివర్తన కలిగించి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
నెల్లూరు: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ జెండాను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆవిష్కరించారు. వంద అడుగుల ఎత్తులో ఈ భారీ మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల చేసి నివాళ్ళు అర్పించిన కలెక్టర్, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ సందేశాన్ని వివరించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం ప్రపంచంలోనే అయిదొవ ఆర్థిక శక్తిగా నిలవడం ప్రజలందరి విజయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పల్నాడు: చిలకలూరిపేట మండలం మురికిపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు జాతీయ జెండా రంగులతో ఉన్న చీరల ధరించి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. జాతీయ జెండా గొప్పతనాన్ని చాటారు. దేశ సమగ్రతను చాటుతూ అందరం ఐక్యతగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరు వనజంగి కొండల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా పర్వతారోహకుడు కృష్ణ ప్రసాద్ సారథ్యంలో యువకులు జెండాను ఎగరవేశారు పర్వత మంచు వంజంగి కొండ ప్రాంతంలో పర్యటకులు సందడి చేశారు.
ఇవీ చదవండి: