జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈడీ అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో... రాంకీ, జగతి పబ్లికేషన్స్‌కు ఊరట లభించింది. ఆ రెండు సంస్థలకు చెందిన ఆస్తులు విడుదల చేయాలని ఆదేశించింది. విశాఖ ఫార్మా సిటీలో బఫర్‌జోన్‌కు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ... రాంకీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 2013, 2015లో విశాఖ ఫార్మాసిటీలోని సుమారు రూ.345 కోట్ల విలువైన భూములను జప్తు చేసింది. అప్పుడు ఈడీ ఉత్తర్వులను అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. రాంకీ, జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఈడీ అప్పీలేట్ ట్రైబ్యునల్... ఫార్మాసిటీ లోపల 50 మీటర్ల వరకు బఫర్‌జోన్‌గా వదిలిపెట్టాలని ఆదేశించింది.
బఫర్‌జోన్ మినహా మిగతా ప్రాంతాల్లో జప్తు చేసిన ఆస్తులు వెంటనే విడుదల చేయాలని ఈడీని ట్రైబ్యునల్ ఆదేశించింది. అయితే బఫర్‌జోన్‌తోపాటు... అమ్మకుండా మిగిలిన ప్లాట్లు విక్రయించొద్దని, నిర్మాణాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని ఈడీ ప్రత్యేక కోర్టులో కేసు తేలే వరకూ... ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఇదే కేసులో జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్లను గతంలో ఈడీ జప్తు చేసింది. జగతి పబ్లికేషన్స్ ఎఫ్డీలను విడుదల చేసి... వెనక్కి ఇవ్వాలని ఈడీని ట్రైబ్యునల్ ఆదేశించింది. కోర్టులో తుది తీర్పు సంస్థకు వ్యతిరేకంగా వస్తే రూ.10 కోట్లు తిరిగి ఇస్తామని జగతి పబ్లికేషన్స్ నుంచి బాండ్ తీసుకోవాలని ఆదేశించింది.
ఇదీ చదవండీ... హోంమంత్రి సొంత మండలంలోనే ఇలా ఉంటే ఏలా..?