వలస కార్మికుల వ్యథలపై 'ఈటీవీ-ఈనాడు' ప్రసారం చేసిన 'కన్నీటి ప్రస్థానం' కథనానికి రెడ్ క్రాస్, ప్రభుత్వం స్పందించింది. చెన్నై నుంచి ఒడిశా, పశ్చిమ్‌బంగ, బిహార్ రాష్ట్రాలకు తరలి వెళ్తున్న కూలీలకు కాజా టోల్ గేట్ వద్ద ఆహారాన్ని అందించారు. వలస కార్మికుల కష్టాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన 'ఈటీవీ-ఈనాడు'ను రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి అభినందించారు.
సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న కార్మికులకు ఆహారంతో పాటు మంచి నీళ్లు అందించారు. వీళ్లందరిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడినుంచి శ్రామిక్ రైళ్లల్లో వారి స్వస్థలాకు పంపుతామని శ్రీధర్ రెడ్డి తెలిపారు. మరోవైపు కార్మిక శాఖ సైతం 'ఈటీవీ-ఈనాడు' కథనానికి స్పందించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని శ్రామిక రైళ్లల్లో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప కమిషనర్ మల్లేశ్వరరావు చెప్పారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులకు ప్రభుత్వం తరఫున ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.