వ్యవసాయ.. అనుబంధ రంగాల సేవల్ని అన్నదాతలకు చేరువ చేసేందుకు ఉద్దేశించిన రైతుభరోసా కేంద్రాలు నగరాలు, పట్టణాల్లోనూ ఏర్పాటు కాబోతున్నాయి. గత నెల 30న గ్రామీణ ప్రాంతాల్లో వీటి సేవల్ని ప్రారంభించారు. గ్రామ సచివాలయానికి ఒకటి చొప్పున గుంటూరు జిల్లాలో 852 ప్రారంభించారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని 12 పట్టణాల పరిధిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. విత్తనాలు, ఎరువులకు పట్టణ రైతులు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంతో పాటు అన్ని పట్టణాల్లో కలిపి 16 కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని వ్యవసాయశాఖ జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
తొలివిడతలో ఐదుచోట్ల ఏర్పాటుకు అనుమతి లభించింది. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, పొన్నూరు, గుంటూరు నగరంలోని బుడంపాడుకు ఒకటి చొప్పున ఐదు కేంద్రాల సేవల్ని వెంటనే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో 16 రైతుభరోసా కేంద్రాలకు ప్రతిపాదనలు పంపగా ఐదుచోట్ల ఏర్పాటుకు అనుమతి లభించినట్లు జేడీఏ విజయభారతి తెలిపారు. తాత్కాలిక భవనాల గుర్తింపు.. శాశ్వత కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వ భూముల సేకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.